అడవుల్లో రగిలిన కార్చిచ్చు ఆస్ట్రేలియాను గడగడలాడిస్తోంది. లక్షాలది ఎకరాల అటవీ సంపదను పొట్టనబెట్టుకున్న దావానలం.. వేలాది మూగ జీవాలను మంటల్లో దగ్ధం చేసింది. వీటితో పాటు తీవ్ర ఆస్తి నష్టం కలిగించింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దావాగ్నిలో ఆవాసాలు కోల్పోయిన ఒంటెలు నీటి జాడ కోసం జనావాసాల వైపు మళ్లాయి. ఇళ్లల్లో ఉన్న నీటి వనరులపై దాడి చేసి దాహార్తిని తీర్చుకునే పనిలో పడ్డాయి.
ఐదు రోజుల్లో పూర్తికి ఆదేశాలు..
అసలే తీవ్ర కరువు ఎదుర్కొంటున్న అక్కడి ప్రజలకు ఒంటెల రాక ప్రతిబంధకంగా మారింది. ఉన్న కాస్త నీటిని ఒంటెలు తాగడం వారికి ఇబ్బందిగా మారింది. కరువు నెలకొన్న ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడ నివసిస్తున్న10వేల ఒంటెలను చంపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పనిని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని స్థానిక అధికారులకు గడువు విధించింది. ఆప్రాంతంలోని ఆదిమ తెగ నాయకుల ఆదేశాల అనంతరం వీటిని నిపుణులైన సాయుధులు హెలికాఫ్టర్ల ద్వారా కాల్చి చంపనున్నారు.