చైనా తెస్తోన్న ఒత్తిళ్లకు ఆస్ట్రేలియా తలొగ్గదని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టంచేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలను ఉటంకిస్తూ చైనా అధికారి విడుదల చేసిన జాబితాపై ఆయన ఈ విధంగా స్పందించారు. తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ చట్టాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి ఒత్తిడికి తలొగ్గమని చైనాకు చురుకలంటించారు.
ఆస్ట్రేలియా విధానాలకు సంబంధించిన దాదాపు 14 అంశాలపై ఫిర్యాదు చేస్తూ చైనా అధికారి ఆస్ట్రేలియా మీడియాకు ఓ జాబితాను అందించారు. ఇందులో గత కొన్నిరోజులుగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలను ప్రస్తావించారు. మీరు చైనాను శత్రువుగా చూస్తే, చైనా శత్రువు అవుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా కఠినమైన చట్టాలు, హువావేపై నిషేధం, ఆస్ట్రేలియాలో చైనా కంపెనీల పెట్టుబడులపై ఆంక్షలను ఆయన ఎత్తిచూపారు. కరోనా విషయంలోనూ అమెరికాకు వంతపాడుతోందని ఆస్ట్రేలియాను విమర్శించారు.