చంద్రుడిపై పరిశోధనలకు ఆసక్తి ప్రదర్శిస్తున్న దేశాల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా చేరింది. నాసా సౌజన్యంతో జాబిల్లిపైకి ఒక రోవర్‌ను పంపనున్నట్లు ప్రకటించింది. అది చంద్రుడి మట్టిని సేకరించి, శోధిస్తుందని పేర్కొంది. అందులోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని భవిష్యత్‌లో మానవ అంతరిక్ష జీవనానికి తోడ్పాటు అందించాలని భావిస్తోంది. దీన్ని 2026లో ప్రయోగించాలని ఆస్ట్రేలియా అనుకుంటోంది. అయితే ఈ దేశంలోని ప్రైవేటు కంపెనీలు ఒక అడుగు ముందుకేసి కెనడాలోని కొన్ని సంస్థలు, సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సాయంతో 2024లోనే చంద్రుడిపైకి ఒక రోవర్‌ను పంపాలనుకుంటున్నాయి. అక్కడ నీటి జాడను శోధించాలనుకుంటున్నాయి. దీని ద్వారా చంద్రుడిపై మానవ ఆవాసానికి బాటలు వేయాలని తలపోస్తున్నాయి.
ఈ ప్రైవేటు సంస్థలు ప్రయోగించే రోవర్ బరువు 10 కిలోలు ఉంటుంది. జపాన్‌కు చెందిన ఐస్పేస్ సంస్థ ప్రయోగించబోయే 'హకుటో' ల్యాండర్‌లో దీన్ని అమర్చి చంద్రుడిపైకి పంపుతారు. రోవర్‌లో రోబోటిక్ హస్తం ఉంటుంది. కెమెరాలు, సెన్సర్ల సాయంతో ఈ సాధనం.. హై రిజల్యూషన్ డేటాను సేకరించి, భూమికి పంపుతుంది. చంద్రుడి ధూళి, శిలలు, మట్టిలో ఉండే పదార్థాల సమాచారాన్ని విశ్లేషిస్తుంది. జాబిల్లి నేలలో నీరు ఉన్న విషయం ఇప్పటికే వెల్లడైంది. అయితే దాన్ని సేకరించే విధానాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అలాగే మానవ వినియోగానికి బాగా ఉపయోగపడే, మైనింగ్ కార్యకలాపాలకు తోడ్పడే, ఆహార వృద్ధికి అనువైన స్థాయిలో నీటిని కలిగి ఉన్న ప్రాంతాలను అక్కడ గుర్తించాల్సి ఉంది. ఆ కసరత్తును ఈ రోవర్ చేపడుతుంది. జాబిల్లిపై మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికీ బాటలు పరుస్తుంది. చంద్రుడిపై ఉండే అసాధారణ వాతావరణ పరిస్థితులు, రేడియోధార్మికత, ల్యాండింగ్ సమయంలో తలెత్తే ప్రకంపనలు, జాబిల్లి ధూళి వంటి వాటిని అధిగమించేలా రోబో హస్తాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నమూనాలను చంద్రుడిని పోలిన వాతావరణంలో పరీక్షిస్తున్నారు.