ఆస్ట్రేలియాలో కొవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న పలువురిలో హెచ్ఐవీ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే టీకా ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ఫార్మా సంస్థ ప్రకటించింది.
ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం, ఫార్మా సంస్థ సీఎస్ఎల్ సంయుక్తంగా 'వీ451' అనే కొవిడ్-19 టీకాను అభివృద్ధి చేశాయి. తొలి దశ ట్రయల్స్ నిర్వహిస్తూ 2,3 దశల క్లినికల్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న క్రమంలో అవాంతరం ఎదురైంది.
" క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 216 మందిలో ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదు. అది వ్యాక్సిన్‌కు బలమైన భద్రతా సామర్థ్యం ఉన్నట్లు తెలియచేస్తోంది. ఈ వ్యాక్సిన్ ద్వారా కొంత మందిలో హెచ్ఐవీ ప్రోటీన్ (జీపీ41)కు సంబంధించిన యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది . అది హెచ్ఐవీ పరీక్షల్లో తప్పుడు పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు దారితీస్తోంది. ఆ తర్వాత సాధారణ పరీక్షల్లో హెచ్ఐవీ లేదని తేలుతోంది. హెచ్ఐవీ సోకేందుకు వ్యాక్సిన్ కారణమయ్యే అవకాశమే లేదు. "
- సీఎస్ఎల్ బయోటెక్.