ఆస్ట్రేలియా విక్టోరియాలోని బల్లారత్ శ్మశానంలో ఓ మహిళ చక్కగా పండ్ల తోటను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. శ్మశానవాటిక అంటేనే అదో నిర్మానుష్య ప్రదేశం. కానీ, ఆ ప్రదేశాన్ని ఓ అందమైన వనంలా మార్చారు హిలెన్ ఆర్చర్డ్ ఎల్లెన్ బర్న్స్. ఎటుచూసినా యాపిల్ పండ్ల చెట్లతో ఇప్పుడా తోట కళకళలాడుతోంది.
తొలుత.. రోడ్డుపై వ్యర్థాలను తగ్గించడంపైనే దృష్టిసారించారు బర్న్స్. కానీ, బల్లారత్లో విపరీత ఆహార కొరతను గ్రహించిన ఆమె.. ఇలా యాపిల్ చెట్లు పెంచడం దిశగా ముందడుగేశారు. ఇలా నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవ్వగా.. నాటి నుంచి సుమారు 10 టన్నుల యాపిల్ పండ్లను పండించి.. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించారు. ఎన్జీఓల తరఫున అక్కడి ప్రజలందరికీ ఎలాంటి సమయంలోనైనా తాజా ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
"2016లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఆ ఏడాది 12శాతం బల్లారత్ స్థానికులు ఆహారం కొరతను అధిగమించారు. అయితే.. లాక్డౌన్ సమయంలో ఈ పండ్ల తోట ద్వారా మరింత మంది ఆకలి తీరడం వల్ల.. తాజా సర్వేలో ఆ సంఖ్య రెట్టింపైనట్టు తేలింది."
- హిలెన్ ఆర్చర్డ్ ఎల్లెన్ బర్న్స్