తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2020, 6:01 PM IST

ETV Bharat / international

చైనా ఆటకట్టించేందుకు ఆస్ట్రేలియా భారీ పెట్టుబడులు

భారత్​తో సరిహద్దు సమస్య సహా.. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనాను నిలువరించటానికి ఆస్ట్రేలియా చర్యలు చేపట్టింది. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రానున్న దశాబ్ద కాలంలో 270 బిలియన్​ ఆస్ట్రేలియన్​ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో భారత్​, జపాన్ వంటి దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.

Aus to invest 270 billion dollars to boost defence capabilities
చైనా ఆటకట్టించేందుకు ఆస్ట్రేలియా భారీ పెట్టుబడులు

ప్రపంచ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో చైనా చేస్తోన్న దురాక్రమణలను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయటం సహా.. ప్రాంతీయ భద్రతను కాపాడుకునే దిశగా దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందుకోసం వచ్చే దశాబ్ద కాలంలో రక్షణ వ్యవస్థలో 270 బిలియన్​ ఆస్ట్రేలియన్​ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధానమంత్రి స్కాట్​ మోరిసన్​ ప్రకటించారు.

"ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో ఎదురవుతోన్న సవాళ్లకు కొత్త విధానం కావాలి. మన ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలను నిరోధించడానికి అది ఉపయోగపడుతుంది. పెరుగుతున్న వ్యూహాత్మక పోటీకి, ఉద్రిక్తతలకు ఇండో పసిఫిక్​ కేంద్రంగా మారింది. ఇటీవల భారత్​-చైనా మధ్య సరిహద్దు సమస్య, దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో సవాళ్లు వంటివి పెరిగాయి. ఈ ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో భారత్​, జపాన్​, ఇండోనేషియా వంటి దేశాలతో కలిసి పని చేస్తూ.. ఆస్ట్రేలియా ముఖ్యపాత్ర పోషిస్తోంది."

- స్కాట్​ మోరిసన్​, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి.

270 బిలియన్​ ఆస్ట్రేలియా డాలర్ల(186.7 బిలియన్​ అమెరికా డాలర్లు) పెట్టుబడులను.. వైమానిక, నేవీ, ఉపరితల భద్రత వ్యవస్థల బలోపేతం కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు ప్రధాని. ఈ నిధుల్లో 800 మిలియన్​ డాలర్లు సముద్రం నుంచి ప్రయోగించే అత్యాధునిక క్షిపణి వ్యవస్థ​ ఏడీఎం-158సి అమెరికా నుంచి కొనుగోలు చేయటం, హైపర్​ సోనిక్​ ఆయుధాల అభివృద్ధికి 9 బిలియన్​ డాలర్లు, 800 మంది రక్షణ సిబ్బంది నియామకానికి మిగతా నిధులను వ్యయం చేయనున్నట్లు తెలిపారు. రక్షణ వ్యవస్థలో కొత్త సామర్థ్యాలు తమ ప్రాంతంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఉపకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మోరిసన్​.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియాపై భారీగా సైబర్‌ దాడులు- ఆ దేశం పనే!

ABOUT THE AUTHOR

...view details