అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) హస్తగతం చేసుకున్న తర్వాత ఆ దేశంలో తూటాల వర్షం కురుస్తోంది. సోమవారం తెల్లవారుజామున కాబుల్ విమానాశ్రయం ఉత్తర ద్వారం వద్ద అఫ్గాన్ బలగాలు, గుర్తు తెలియని దుండగుల మధ్య కాల్పులు జరిగినట్లు జర్మనీ మిలిటరీ తెలిపింది. ఈ కాల్పుల్లో అఫ్గాన్ భద్రతా దళానికి చెందిన ఓ అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది.
విమానాశ్రయం వద్ద కాల్పులు జరిగిన క్రమంలో అమెరికా, జర్మనీ బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయని, అయితే.. జర్మనీ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది ఆ దేశ ఆర్మీ. కాల్పులు ఎవరు జరిపారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని పేర్కొంది. కాబుల్ ఎయిర్పోర్ట్ బయట తాలిబన్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు నాటో, అఫ్గాన్ దళాలపై కాల్పులు జరపలేదని తెలిపింది.