అఫ్గానిస్థాన్, నాన్ గర్హార్ రాజధాని జలాలాబాద్ లో ఓ జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐఎస్) చేసిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. వందలాదిమంది తీవ్రవాదులు, రక్షక బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. దీంతో జలాలాబాద్ జైలును సీజ్ చేశారు అధికారులు.
స్థానిక గవర్నర్ కార్యాలయం సమీపంలో, నిత్యం భారీ భద్రతా బలగాలు మోహరించి ఉండే ప్రాంతంలో ఉంది ఆ జైలు. అయినా, ఆదివారం ప్రవేశద్వారం వద్ద ఓ కారు బాంబు పేలింది. ఆపై భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఐఎస్ తీవ్రవాదులు. రాత్రంతా ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి.