తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై యాంటీ మలేరియా డ్రగ్ మెరుగ్గా పనిచేయదట!

హైడ్రాక్సీక్లోరోక్విన్.... కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న పేరు. మలేరియా చికిత్సకు ఉపయోగించే ఈ ఔషధం... కరోనాను నయం చేసేందుకూ బాగా పనికొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్లే ఈ డ్రగ్​ కోసం భారత్​కు వేర్వేరు దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. అయితే... హైడ్రాక్సీక్లోరోక్విన్​ అంత ప్రభావవంతమైనది కాదని చెబుతున్నారు చైనా, ఫ్రాన్స్​కు చెందిన పరిశోధకులు.

By

Published : Mar 26, 2020, 11:22 AM IST

Antimalarial drug no better than standard coronavirus care: study
హైడ్రాక్సీక్లోరోక్విన్​

హైడ్రాక్సీక్లోరోక్విన్​... యాంటీమలేరియా డ్రగ్​. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 'దేవుడిచ్చిన బహుమతి'గా హైడ్రాక్సీక్లోరోక్విన్​ను పరిగణించారు. అయితే ఈ డ్రగ్​ ప్రామాణిక చికిత్స కంటే ప్రభావవంతమైనదేమీ కాదని ఇటీవలి చైనా వైద్య పరిశోధనలు పేర్కొన్నాయి. మార్చి 6న జేజియాంగ్​ యూనివర్సిటీ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. కొవిడ్​-19 సోకిన 30 మంది రోగులపై చైనా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

రెండు గ్రూపులుగా పరీక్ష

వీరిలో 27 మంది కరోనా రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. 13 మందికి హైడ్రాక్సీక్లోరోక్విన్​ డ్రగ్​ను ఇచ్చారు. మరో 14 మందికి ఇవ్వలేదు. ఇలా వారం రోజులు చేసిన తర్వాత వారందరినీ పరీక్షించగా.. ఈ 14 మందితో పోలిస్తే యాంటీమలేరియా డ్రగ్ తీసుకున్న 13 మందికి కరోనా నెగటివ్​గా వచ్చింది. అయితే ఇందులో ఓ రోగికి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.

కానీ ఈ రెండు గ్రూపుల్లోనూ కరోనా నుంచి కోలుకునేందుకు పట్టే సగటు సమయం మాత్రం ఒకేలా ఉండటం గమనార్హం.

కరోనాపై ఇదే డ్రగ్​ను యాంటీబయాటిక్​ అజిత్రోమైసిన్​తో కలిపి తీసుకున్నప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేసిందని ఇటీవలి ఫ్రెంచ్​ అధ్యయనంలో తేలింది. అందుకే ప్రస్తుతం హైడ్రాక్సీక్లోరోక్విన్​తో పాటు దాని అనుబంధ సమ్మేళనమైన క్లోరోక్విన్​​పై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపుతోంది.

'గేమ్​ ఛేంజర్​'

అమెరికాలో ఈ ఔషధం​ తగినంతగా అందుబాటులో ఉండేందుకు తన అధికార యంత్రాంగం ఫార్మా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ట్రంప్​ ఇటీవలే ప్రకటించారు. అయితే... పరీక్షలు చేసి ధ్రువీకరించడానికి ముందే.. ఈ ఔషధంపై అతిప్రచారం(ఓవర్​హైప్​) చేయడం తగదని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం వీటిని 'దేవుడిచ్చిన బహుమతి', 'గేమ్ ఛేంజర్​'గా పరిగణిస్తున్నారు. ఆయన సతీమణి మెలానియా ట్రంప్​ కూడా ఈ మెడిసిన్​ను పరీక్షించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా వైరస్​ అమెరికాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1000 మందికిపైగా మరణించారు. 68 వేలకు పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 21వేల మందికిపైగా చనిపోయారు. 4.5లక్షల కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి : కరోనాతో మలేరియా మందుకు గిరాకీ.. అమెరికా నుంచి ఆర్డర్లు!

ABOUT THE AUTHOR

...view details