పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, జనరల్ (రిటైర్డ్) పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పెషావర్ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మతిస్థిమితం లేని న్యాయమూర్తిని' తొలగించాల్సిందిగా సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌ను కోరనున్నట్లు తెలిపింది. అలాగే ఉరిశిక్ష తీర్పుపై అప్పీల్ చేయాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
శవాన్ని ఉరితీయండి
ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనానికి పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించారు. ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ 167 పేజీల వివరణాత్మక తీర్పునిచ్చారు.
"పారిపోయిన దోషిని (ముషారఫ్) పట్టుకొని, చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఒక వేళ ఉరిశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్ చనిపోతే.. అతని శవాన్ని పార్లమెంట్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజులపాటు ఉరితీయాలి"- జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్, ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి
పాక్ చట్టాలకు విరుద్ధం
ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన న్యాయబృందంతో సంప్రదించారు. తరువాత న్యాయమంత్రి ఫరోగ్ నసీమ్ మాట్లాడుతూ.. ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పాక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి 'మతిస్థిమితం లేదని', వెంటనే అతనిని పదవి నుంచి తొలగించాలని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌కు నివేదించనున్నట్లు ప్రకటించారు.