చైనాలో మొదలైన కోవిద్-19 (కరోనా) వైరస్ మార్చి13 నాటికి 110 దేశాల్లో 1,32,000 మందికి పైగా సోకి 4,947 మరణాలకు కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ వైరస్ వల్ల మరణాల రేటు వయోవృద్ధుల్లోనే ఎక్కువగా ఉందని చైనా, ఇటలీ దేశాల అనుభవం తెలుపుతోంది. ఇటలీ జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. మార్చి 4వ తేదీ నాటికి ఆ దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన 105 మంది సగటు వయసు 81 సంవత్సరాలు. స్విట్జర్లాండ్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం చైనాలో కరోనా వైరస్ వల్ల మరణించినవారిలో 20 ఏళ్ల లోపు ప్రాయంలోని వారు 1శాతంకన్నా తక్కువ. అదే 80 ఏళ్ల్లు పైబడినవారిలో మృతుల శాతం 18శాతం వరకు ఉంది. దీన్నిబట్టి వయోవృద్ధులందరికీ మృత్యువు పొంచి ఉందని కాదు. ఇటలీలో మరణించిన 105మంది వృద్ధులలో మూడింట రెండు వంతుల మందికి మూడు లేక అంతకుమించి పూర్వ రుగ్మతలు ఉన్నాయి.
రోగ నిరోధక శక్తే కీలకం
అధిక రక్తపోటు, హృద్రోగం, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్న వృద్ధులకు కరోనా గండం అధికం. అంతకన్నా పిన్న వయస్కులకు పూర్వ వ్యాధులు ఉంటే వారు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. వయసు మీరినవారిలో రోగ నిరోధక శక్తి సహజంగానే తగ్గిపోతుంది. దీనికి తోడు హృద్రోగం, రక్తపోటు, మధుమేహం ఉంటే అంతర్గత అవయవాల పనితీరు మందగిస్తుంది. రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉన్న కొద్ది కణాలు కూడా వయసులో ఉన్నంత చురుగ్గా పనిచేయవు. 60 ఏళ్లు, 70 ఏళ్లు పైబడిన చాలామందిలో రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నా, 75-80 ఏళ్లు వచ్చేసరికి ఆ శక్తి బలహీనపడిపోతుంది. దేహంలో ప్రవేశించిన అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి వృద్ధుల రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) అతిగా ప్రతిచర్యకు దిగడంతో సమస్య వస్తోంది. కరోనా వైరస్ చొరబడగానే, దాన్ని ఎదుర్కోవడానికి దేహం భారీయెత్తున సైటోకైన్ అనే ప్రోటీన్లను విడుదల చేస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో సైటోకైన్ ప్రభంజనం అంటారు. మితిమీరి విడుదలయ్యే సైటోకైన్ల వల్ల అంతర్గత వాపు ఏర్పడుతుంది. తీవ్ర జ్వరం, అంతర్గత అవయవాల వైఫల్యం సంభవిస్తుంది. సంతోషించాల్సిన విషయమేమంటే సైటోకైన్ ప్రభంజనాన్ని అదుపు చేసి మరణాల రేటును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉండటం.
కొత్త రోగానికి పాత మందులు
వృద్ధ రోగుల్లో సైటోకైన్ ప్రభంజనాన్ని పసిగట్టడానికి చైనా వైద్యులు సీరమ్ ఫెరిటిన్ రక్త పరీక్ష నిర్వహిస్తున్నారు. సైటోకైన్ ప్రభంజనాన్ని అరికట్టడానికి కార్టికో స్టెరాయిడ్ మందులు ఉపయోగపడతాయి కానీ, కరోనా వల్ల తీవ్ర అస్వస్థుడైన వ్యక్తికి ఆ మందులను వాడటం అభిలషణీయం కాదని వైద్యులు భావిస్తున్నారు. వాటికి బదులు కీళ్లవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రయోగించే మందులను ఉపయోగిస్తున్నారు. ఇంటర్ ల్యూకైన్ (ఐఎల్-1, ఐఎల్-6, ఐఎల్-18), ఇంటర్ఫెరాన్-గామా వంటి సైటోకైన్ ప్రోటీన్లను అదుపు చేసే మందులను చైనాలో వాడుతున్నారు. వృద్ధుల్లో ప్రధానంగా ఐఎల్-6 అతిగా విడుదల కావడం వల్లనే రోగ నిరోధక వ్యవస్థ మితిమీరిన చురుకుదనం ప్రదర్శిస్తూ మృత్యువును కొనితెస్తోందని పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని అరికట్టడానికి ఆక్టెమ్రా అమోఘంగా ఉపయోగపడుతోంది. స్విట్జర్లాండ్ కు చెందిన రోష్ కంపెనీ కీళ్లవాతం మందు ఆక్టెమ్రాను చైనాకు విరాళమిచ్చింది. అది నేరుగా కరోనా వైరస్ ను చంపదు. ఐఎల్-6ను నియంత్రిస్తుంది. కరోనా వైరస్‌ను, అది కలిగించే దుష్ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చైనా వైద్యులు హెచ్‌ఐవీ మందు కాలెట్రా, ఫ్లూ మందు ఆర్బిడాల్‌ను కూడా వాడుతున్నారు. గిలియాడ్ సైన్సెస్ సంస్థ తయారుచేసిన రెండెసివిర్‌తో రోగులపై ప్రయోగాలు జరుపుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ తయారీ యత్నాలూ జోరుగా సాగుతున్నాయి.