తెలంగాణ

telangana

ETV Bharat / international

'గల్వాన్‌' ఘటనపై చైనా వీడియో

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో సైనికుల మధ్య ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చైనా. శనివారం ఇరు దేశాల మధ్య కీలక చర్చలకు ముందు వీడియో విడుదల చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై స్పందించేందుకు నిరాకరించింది భారత సైన్యం.

Galwan video
గల్వాన్‌ ఘటన.. చైనా వీడియో

By

Published : Feb 20, 2021, 5:41 AM IST

లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఓ వీడియోను డ్రాగన్‌ దేశం తాజాగా విడుదల చేసింది. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండటం, శనివారం 10వ దఫా చర్చల వేళ ఈ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గల్వాన్‌ ఘటన.. చైనా వీడియో

జూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ విడుదల చేసింది. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చినట్లు అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా పేర్కొంది.

ఈ వీడియోపై మాట్లాడేందుకు భారత సైన్యం నిరాకరించింది. అయితే.. గల్వాన్​లో తన సైనికుల అరాచకాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని భారత సైన్యంలోని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. గతంలోనూ ఇలాంటి వీడియోలను విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మరోవైపు.. శనివారం కీలక చర్చలకు ముందు చైనా ఈ వీడియో విడుదల చేయటం వెనక ఉన్న అంశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదే దాడి ఘటనలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు మరో 19 మంది అమరులైన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన 30 మంది సైనికులు ఈ ఘటనలో మరణించినట్లు భారత సైన్యం చెబుతుండగా.. కేవలం ఐదుగురు మాత్రమే మరణించినట్లు చైనా ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి:'గల్వాన్​' మృతులపై తొలిసారి చైనా ప్రకటన

ABOUT THE AUTHOR

...view details