ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) పుట్టుకకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అమెరికా దీనిపై విచారణ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అగ్రరాజ్యానికి చెందిన కీలక సెనెటర్ల బృందం అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయంలో కొన్ని సూచనలు చేసింది. విచారణలో అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్ సహా ఇతర ఐరోపా దేశాలతో కలిసి పనిచేయాలని కోరింది. ఫలితంగా విచారణ పారదర్శకంగా, విశ్వసనీయంగా సాగుతుందని హితవు పలికింది.
వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయాధికారం విషయంలోనూ దర్యాప్తు సాగాలని సెనెటర్లు సూచించారు. ఈ మేరకు గురువారం రిపబ్లికన్ సెనెటర్ మాక్రో రూబియో నేతృత్వంలోని ఓ బృందం ట్రంప్‌నకు లేఖ అందజేసింది. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఉన్నతస్థాయి దౌత్యవేత్తలను నియమించాలని సెనెటర్లు అధ్యక్షుడిని కోరారు. అంతేకాకుండా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వైరస్‌కు సంబంధించిన ఇతర అంశాల్లోనూ విచారణ సాగాలని సూచించారు.