తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాకు కరోనాను తెచ్చింది అమెరికానే..? - india corona update

ఎన్నో ప్రాణాల్ని బలి తీసుకున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా సందిగ్ధం నెలకొంది. తొలి కరోనా కేసు చైనాలోని వుహాన్​ నగరంలో నమోదుకావటం వల్ల వైరస్​ పుట్టినిల్లు చైనా అని అందరూ భావిస్తున్నారు. దీనిని మాత్రం ఆ దేశం ఖండిస్తుంది. అసలు మహమ్మారి అమెరికా నుంచే తమ దేశానికి వచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిజియన్​ జాహో ట్విట్టర్​లో వెల్లడించారు.

America brings Corona to China
చైనాకు కరోనాను తెచ్చింది అమెరికానే..?

By

Published : Mar 14, 2020, 10:03 AM IST

Updated : Mar 14, 2020, 11:28 AM IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మొదటి కేసు చైనాలో బయటపడ్డప్పటికీ, అది కచ్చితంగా ఎక్కడ ఆరంభమైందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్‌ సోకిన పేషెంట్‌ జీరో(వైరస్‌ బారినపడిన మొదటి వ్యక్తి) ఎవరనే దానిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. చైనాలోని వుహాన్‌ నగరంలో తొలి కేసు నిర్ధరణ కావడం, అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వుహాన్‌లోనే ఈ వైరస్‌ బయటపడ్డట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా వైరస్‌ పుట్టుకపై కొత్త వాదన మొదలైంది. అసలు కొవిడ్‌-19వైరస్‌ చైనాకు రావడానికి అమెరికా కుట్ర పన్నిందని తాజాగా చైనా ఆరోపించింది. అమెరికా ఆర్మీనే ఈ వైరస్‌ను చైనాకు తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేస్తూ తాజాగా ఆ దేశ అధికారులు ఆరోపణ చేశారు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిజియన్‌ జాహో తన ట్విటర్ పేజీలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే చైనా-అమెరికా మధ్య ట్రేడ్‌ వార్‌ నడుస్తున్న సమయంలో ఈ మాటల యుద్ధం మరింత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.

ప్రపంచదేశాలను వణికిస్తోన్న ఈ వైరస్‌కు అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 'కొవిడ్‌-19' అని నామకరణం చేసినప్పటికీ..అమెరికన్లు మాత్రం 'చైనా వైరస్‌'గానే సంభోదిస్తున్నారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇతర ఉన్నతాధికారులు కూడా దీన్ని 'వుహాన్‌ వైరస్‌', 'చైనా వైరస్‌'గానే అభివర్ణించడం చైనా జీర్ణించుకోలేకపోతోంది. దీనికితోడు, కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తిని గుర్తించడంలో చైనా విఫలమైందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలతో చైనా మరింత ఆగ్రహానికి గురయ్యింది. అయితే చైనా మాత్రం ఈ వైరస్‌ తమదేశంలో పుట్టలేదని ఇంకా నమ్ముతున్నట్లు వాదిస్తోంది. వైరస్‌ ఎక్కడ ఆరంభమైందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయని.. దీనిపై అప్పుడే నిర్ణయానికి వచ్చి ఒక ప్రదేశాన్ని ఎందుకు నిందిస్తారని ప్రశ్నిస్తోంది.

అమెరికాలో కూడా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై దృష్టిపెట్టకుండా, వైరస్‌ ప్రారంభమైనట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని తప్పుగా చూపుతూ నిందలు వేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అమెరికాలో మొదటికేసు ఎప్పుడు నమోదైంది? ఇప్పటివరకు ఎంతమంది దీని బారినపడ్డారు? ఆసుపత్రుల వివరాలేంటి అనే ప్రశ్నలకు అమెరికా బహిరంగ సమాధానం చెప్పగలదా అంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో ముందు అమెరికా పారదర్శకంగా ఉండాలని, తమ దగ్గరున్న సమాచారాన్ని అక్కడి ప్రజలకు బహిర్గతం చేయాలని సూచించింది. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

గత అక్టోబరులో వుహాన్‌లో 'అంతర్జాతీయ మిలటరీ ప్రపంచ క్రీడలు' జరిగాయి. దాదాపు వంద దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో అమెరికన్‌ సైన్యం కూడా పాలుపంచుకుంది. దీన్ని ఆధారంగా చేసుకొని తాజాగా చైనా ఈ రకమైన ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే, దీనిపై చైనాలో ఉన్న అమెరికన్‌ ఎంబసీ మాత్రం స్పందించలేదు.

చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడ్డట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర వేల మందిని బలితీసుకుంది. మరో లక్షా 30వేల మందికి సోకిన ఈ వైరస్‌పై వస్తున్న ఆరోపణలను గతకొంతకాలంగా చైనా తిప్పికొడుతూనే ఉంది.

ఇదీ చూడండి:కరోనా కట్టడికి సైన్యానికి 24 గంటల సమయం

Last Updated : Mar 14, 2020, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details