అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా యుద్ధ విమానాలు చైనాలోని షాంఘైకి 76.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సంవత్సరాల్లో అమెరికా యుద్ధ విమానాలు చైనా తీరానికి ఇంత దగ్గరగా రావటం ఇదే ప్రథమమని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జలాంతర్గాముల విధ్వంసక విమానం పి-8ఎ, నిఘా విమానం ఇపీ-3ఈ తైవాన్ జలసంధి గగనతలం మీదుగా ఝెజియాంగ్, ఫుజియాన్ తీర సమీపానికి వచ్చి వెళ్లాయని పెకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేధోమథన సంస్థ తెలిపింది.
ఆదివారం ఉదయం చేసిన ట్వీట్‌లో అమెరికా నిఘా విమానం తైవాన్ జలసంధి దక్షిణ భాగంలోకి వచ్చిందని, అదే రోజు రాత్రి చేసిన మరో ట్వీట్‌లో జలాంతర్గాముల విధ్వంసక విమానం పి-8ఎ, దాని వెంట నిఘా విమానం, గైడెడ్ మిసైల్స్ విధ్వంసక విమానాలు వరుసగా షాంఘై నగర సమీపంలోకి వచ్చాయని బహుశా అవన్నీ కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లుగా ఉందని ఆ సంస్థను ఉటంకిస్తూ సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.