తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2021, 4:59 AM IST

ETV Bharat / international

జైల్లోనే నిరాహార దీక్షకు దిగిన రష్యా విపక్షనేత!

రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లోనే నిరాహార దీక్షకు దిగారు. అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించటం లేదని ఆరోపించారు. తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ జైలు అధికారికి ఓ లేఖ రాశారు నావల్నీ.

Alexey navalny
రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ

జైలుశిక్ష అనుభవిస్తోన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ నిరాహార దీక్షకు దిగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని అలెక్సీ నావల్నీ ఆరోపించారు. తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ అలెక్సీ జైలు అధికారికి ఓ లేఖ రాశారు. రాత్రి సమయాల్లో ప్రతి గంట గంటకూ నిద్ర లేపుతూ తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని.. తనకు చికిత్స నిరాకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన అనారోగ్యాన్ని పరీక్షించేందుకు నిపుణుడిని లోనికి అనుమతించాలని జైలు అధికారులకు విన్నవించినప్పటికీ.. వారం గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్లు నావల్నీ ప్రకటించారు.

విడుదల కోసం ఆందోళనలు..

రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ విడుదల కోసం గతకొన్ని రోజుల క్రితం రష్యాలో ప్రధాన నగరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆందోళనలకారులను నిలువరించేందుకు అనేక చోట్ల లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్​, యెకాటెరిన్బర్గ్​, యుజ్నో-సఖాలిన్స్క్‌ సహా మొత్తం 90​ నగరాల్లో దాదాపు 3000 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు.

2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఈ జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. తాజాగా అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్షకు దిగారు.

ఇదీ చూడండి:'నావల్నీ' నిరసనలు ఉద్ధృతం- 5000 మందికిపైగా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details