కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాలతో ప్రపంచం మొత్తం అనిశ్చిత స్థితిలో ఉంది. ఆందోళనకు లోనవుతోంది. సాధారణంగా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఆశ్రయిస్తుంటారు. ఈ కోవలో మద్యాన్ని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువే. కరోనా ముప్పును మద్యం మరింత పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలకు స్వాగతం పలుకుతుందని పరిశోధకులు వెల్లడించారు.
రోగ నిరోధక శక్తిపై దుష్ప్రభావం
వ్యాధి ప్రభావాన్ని తీవ్రం చేయడానికి మద్యపానం దోహదపడుతుందని ఇటలీ పరిశోధకులు వెల్లడించారు. "శ్వాసకోశ వ్యవస్థలో వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఎక్కువయ్యే ప్రమాదాన్ని మద్యపానం పెంచుతుంది. మద్యం వ్యసనపరుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. వారికి వెంటిలేటర్ల ద్వారా శ్వాస అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది" అని ఇటలీకి చెందిన పరిశోధకుడు గియన్ని టెస్టినో చెబుతున్నారు. మద్యం తాగే వారిలో ఏసీఈ-2 ప్రొటీన్ స్థాయులు పెరగవచ్చని గియన్ని బృందం తాజాగా గుర్తించింది. ఈ పరిశోధన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు ఏసీఈ-2 దోహదపడుతుందనే విషయం తెలిసిందే.
మెదడుపై ప్రభావం ఇలా..
ఆల్కహాల్ మెదడులోని కొన్ని నాడీ ప్రసారాలపై ప్రభావం చూపుతుంది. మెదడులో గమ్మా అమినోబుటిరిక్ యాసిడ్(గాబా) అనేది నాడీ ప్రసారాలను నిరోధించడం లేదంటే తగ్గించడం చేస్తుంది. గాబా ఉత్పత్తిని మద్యం పెంచుతుంది. అది నాడీ కణాల చర్యలను తగ్గిస్తుంది. అలానే నాడీ కణాల చర్యల్ని పెంచే గ్లుటమేట్ ఉత్పత్తిని మద్యం ప్రభావితం చేస్తుంది. అంటే ఎవరైనా తాగినప్పుడు మోతాదును బట్టి వారి శరీరం, మెదడు నెమ్మదిస్తాయి. భ్రాంతి, సమన్వయం తప్పడం జరుగుతుంది. అంటే మద్యపానం ఒత్తిడి తగ్గించడానికి బదులు మరింత పెంచుతుంది. ఈ అలవాటు కొనసాగితే మెదడులోని ప్రోత్సాహక కేంద్రంపై ప్రభావం చూపుతుంది. డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మరింత మద్యం కావాలని కోరుతుంది. అంటే ఇంకా మందు తాగేలా చేస్తుంది. "ప్రజలు వారి ఒత్తిడి తగ్గించుకోవడానికి తరచుగా మద్యం తాగుతారు. కానీ కొంతకాలానికి ఇది వారిలో ఒత్తిడి తగ్గించకపోగా.. మరింత పెంచుతుంది" అని సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకుడు మైఖేల్ ఫెర్రెల్ తెలిపారు. 'ఒత్తిడి.. తాగడానికి దారితీస్తే.. తాగడం ఒత్తిడికి దారితీస్తుంది' అని చెబుతున్నారు.
విదేశాల్లో లాక్‌డౌన్ సమయంలో పెరిగిన అమ్మకాలు
లాక్‌డౌన్ సమయంలో అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. అమెరికాలో గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 55%, బ్రిటన్‌లో 22% విక్రయాలు పెరిగాయి. దక్షిణాఫ్రికా, భారత్, శ్రీలంక, గ్రీన్‌లాండ్ దేశాల్లో లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలను బంద్ చేసినా, వినియోగం తగ్గలేదని నివేదికలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మన దేశంలో నిషేధం ఉండడంతో మొదట్లో విలవిల్లాడిన మద్యం ప్రియులు- ఇటీవల గేట్లు ఎత్తేయడంతో తెగ తాగేస్తున్నారు.
క్షణ భంగురమే..
నిషాతో ఆ నిమిషం హాయిగా అనిపించినట్లు ఉంటుంది. రక్తంలోని ఆల్కహాల్ స్థాయి పెరుగుతుంది. మెదడు విశ్రాంతి పొందుతున్నట్లు, కొంత భ్రాంతి, ఉల్లాస స్థితి కలుగుతుంది. అదంతా కాసేపే. 20-30 నిమిషాల తర్వాత శరీరం ఆల్కహాల్‌ని బయటికి పంపించడం ప్రారంభిస్తుంది. అలా రక్తం నుంచి ఆల్కహాల్ బయటికి వెళ్లగానే అసౌకర్యం మొదలవుతుంది. తాగక ముందు ఉన్న ఒత్తిడి కంటే.. నిషా తగ్గిన తర్వాత ఇంకా ఎక్కువవుతుంది.