జమ్ముకశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగాకేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో ఇంకా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు.
జమ్ముకశ్మీర్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న సమావేశం కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.