అఫ్గాన్ పరిణామాలు.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అండగా మారుతున్నాయా? భారత్‌పై దాడులు చేసేందుకు వారు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత... పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల ఉనికి జమ్ముకశ్మీర్‌లో అధికమైంది. 2019లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత ముష్కరుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా 'ఈయూ టుడే' తన కథనంలో తెలిపింది.
అందరూ క్రియాశీలకంగా..
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌కు చెందిన ముష్కరులు చాలా మంది.. దేశంలోకి చొరబడుతున్నారని ఆ పత్రిక తన కథనంలో తెలిపింది. అఫ్గాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్‌తో ఈ ఉగ్రసంస్థలు కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. జులై నుంచి దాదాపు 50 మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించగా.. వారంతా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నట్లు చెప్పింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సహా సరిహద్దు ప్రాంతాల నుంచి వారు జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించారని పేర్కొంది.