తాలిబన్లు ఆక్రమించుకున్న అఫ్గానిస్థాన్ ఆర్థిక కష్టాలు(Afghanistan's economic crisis) ముదురుతున్నాయి. కరవు కోరల్లో ఉన్న దేశంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. లక్షలాది మందికి మానవతా సహాయం అందించాల్సిన పరిస్థితి ఉందని ఐరాస సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వందలాది మంది అఫ్గాన్ పౌరులు బ్యాంకుల ముందు నిరసనకు దిగారు. డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరారు. రాజధానిలోని న్యూ కాబుల్ బ్యాంక్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గడిచిన ఆరు నెలలుగా తమకు చెల్లింపులు చేయలేదని.. బ్యాంకుల కార్యకలాపాలు మూడు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైనా.. నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటీఎంలు పనిచేస్తున్నా.. రోజుకు 200 డాలర్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుందని చెబుతున్నారు.
బ్యాంకుల ఎదుట అఫ్గాన్ వాసుల నిరీక్షణ ఆకలి కేకలు
కరవు పరిస్థితులు 70 లక్షల మంది ప్రజల జీవనంపై ప్రభావం చూపనుందని ఐరాస విభాగమైన ప్రపంచ ఆహార కార్యక్రమం(World Food Programme) అంచనా వేసింది. ప్రతి ముగ్గురు అఫ్గాన్ పౌరుల్లో ఒకరికి అత్యవసరంగా ఆహారం అందించాల్సిన పరిస్థితి ఉందని ఈ నెల మొదట్లో పేర్కొంది. ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని తెలిపింది.
కాబుల్‌లోని ఓ బ్యాంకు ఎదుట ప్రజల క్యూ ఔషధాల కొరత
వైద్య సదుపాయాల విషయంలోనూ అఫ్గాన్ సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలో ఔషధాలు కొద్దిరోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా నివారణకు అవసరమయ్యే పరికరాల కొరత ఉందని తెలిపింది. కాబుల్ పేలుళ్ల(Kabul airport blasts) తర్వాత ప్రాథమిక చికిత్స కిట్లకు డిమాండ్ భారీగా పెరిగిందని పేర్కొంది.
వాణిజ్యపరమైన రాకపోకలకు కాబుల్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేయడం వల్ల.. ఔషధాలను తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం డైరెక్టర్ రిక్ బ్రెన్నన్ తెలిపారు. పాకిస్థాన్ సహకారంతో ఇతర మార్గాల ద్వారా అవసరమైన పరికరాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయ సంక్షోభం!
మరోవైపు, అఫ్గానిస్థాన్‌లో వ్యవసాయ పరిస్థితులపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం పంట దిగుబడి గతేడాదితో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులకు సహాయం అందించాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో 1.10 లక్షల కుటుంబాలకు సహాయం అందించగలమని పేర్కొంది. మరో 15 లక్షల మందికి ఇంకా సహాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి:'పంజ్‌షేర్'లో నిశ్శబ్దం- తుపాను ముందు ప్రశాంతతా?