అగ్రరాజ్య సైన్యం సామాను సర్దుకుని వెళ్లిపోయింది. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రతిపక్షం అనే వాటికి చోటు లేకుండా పోయింది. మరి.. అఫ్గానిస్థాన్‌ను తమదైన శైలిలో పాలించేందుకు సిద్ధమైన తాలిబన్లను ఎదిరించేదెలా? వారిని గద్దె దించడం సాధ్యమేనా? ఇందుకు వినిపిస్తున్న జవాబు.. అంతర్యుద్ధం.
అంతర్యుద్ధం.. అఫ్గానిస్థాన్‌కు కొత్తేమీ కాదు. 2001లోనూ జరిగింది అదే. అయితే.. అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని(taliban government) కూల్చింది అమెరికా దళాలు, అక్కడి ప్రజలు మాత్రమే కాదు.. అఫ్గాన్ స్థానిక కమాండర్లు, రాజకీయ నేతలు కూడా! అందుకే.. పంజ్‌షేర్ వంటి ప్రాంతాలపై పట్టున్న స్థానిక నేతలు ఇప్పుడు మరోమారు కీలకమయ్యారు. వారు తీసుకునే నిర్ణయాలు తాజా సంక్షోభాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందోనన్న చర్చకు కారణమయ్యారు.
వాస్తవానికి కాబుల్‌ను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు భారీ ప్రణాళికలే రచించారు. ఇందులో భాగంగా.. వేర్వేరు రాష్ట్రాల్లోని స్థానికులు, తెగలపై పట్టు ఉన్న కీలక నేతలు, సంఘాలను కానుకలు, ఇతర ప్రలోభాలతో సంతృప్తి పరిచారు. తమకు అడ్డంకిగా ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వంలో తాలిబన్ల కింద పనిచేసేందుకు వీరు అంగీకరించకపోవచ్చు. తాలిబన్ల నూతన వ్యవస్థకు వ్యతిరేకంగా, సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా వీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
ఈ పరిణామాలతో తాలిబన్లకు చిక్కులు తప్పవని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు(afghanistan latest news).
ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్..
తాలిబన్లకు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ కాస్త తలనొప్పిగా మారింది. అయితే కాబుల్ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడి వార్తల్లో నిలిచినప్పటికీ..ఐసిస్-కే (isis k afghanistan attack) శక్తిసామర్థ్యాలు వాస్తవానికి తక్కువే. కేవలం 5వేల మందితో తూర్పు అఫ్గాన్‌లోని నంగర్హర్, కునార్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. నియామకాలు, భారీస్థాయి పేలుళ్లకు పాల్పడి ప్రపంచం దృష్టిలో పడాలని ఐసిస్-కే భావించినా.. రాజకీయ వ్యవస్థకు, జాతీయ భద్రతకు సవాళ్లు విసిరే స్థాయికి ఐసిస్-కే చేరుతుందా అంటే అనుమానమే! గ్రామాల్లో ఈ సంస్థకు ఆదరణ ఉందా? తాలిబన్లను కాకుండా వాటి ప్రత్యర్థులైన ఐసిస్-కేకు పాకిస్థాన్ సహాయం చేస్తుందా? అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాలు లేవు. అందువల్ల ఐసిస్-కే నుంచి తాలిబన్లకు ఇప్పటికైతే పెద్ద ముప్పులేదనే చెప్పుకోవచ్చు.
ఇదీ చూడండి:-Kabul Airport: తాలిబన్ల వశమయ్యాక కాబుల్ ఎయిర్పోర్ట్ ఇలా...
పంజ్‌షేర్ సింహాలు...
తాలిబన్లకు ప్రధాన అడ్డంకి పంజ్‌షేర్ సింహాలు(taliban panjshir), నార్తన్ అలయన్స్ నుంచే. పంజ్‌షేర్‌ను దక్కించుకునేందుకు గతంలో తాలిబన్లు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తాజా సంక్షోభంలో.. పంజ్‌షేర్‌లో తాము పైచేయి సాధించామని తాలిబన్లు ప్రకటించినా, ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టత లేదు.
పంజ్‌షేర్‌కు నాటి యుద్ధవీరుడు అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్(ahmad massoud latest news) నాయకత్వం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలోని ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్.. మసూద్‌తో చేతులు కలిపారు. అయితే విదేశీ శక్తుల నుంచి సహాయం అందకపోవడం వల్ల తాలిబన్ల విషయంలో పంజ్‌షేర్ సింహాలు వెనకబడ్డాయి. అందువల్ల తాలిబన్లతో సంప్రదింపులు జరిపేందుకు మసూద్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:-Afghan Crisis: మీడియాకు తాలిబన్ల వార్నింగ్- 'మసూద్' వార్తలపై నిషేధం!
మరోవైపు ఉజ్బెక్ వారసత్వానికి చెందిన జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్.. ఉత్తర అఫ్గానిస్థాన్‌పై పట్టుసాధించేందుకు 1980 నుంచి ప్రయత్నిస్తున్నారు. నార్తన్ అలయన్స్ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు. 2001లో తాలిబన్లను గద్దె దించేందుకు అమెరికాకు సహాయం చేశారు. అనంతరం అగ్రరాజ్యం అండతో ఏర్పడిన ప్రభుత్వంలో అనేక పదవులను చేపట్టారు. ప్రతీకారం తీర్చుకునేందుకు రషీద్‌పై తాలిబన్లు రెండుసార్లు హత్యాయత్నం చేశారు. వాటి నుంచి ఆయన తప్పించుకున్నారు. అయితే ఆగస్టులో కాబుల్ కోట కూలిన అనంతరం ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లిపోయారు.
1980లో ముజాహిదీన్ కమాండర్‌గా విధులు నిర్వర్తించిన మహమ్మద్ నూర్, రషీద్‌తో చేతులు కలిపారు. తాలిబన్లపై పోరు కోసం గతంలో నార్తన్ అలయన్స్‌లో చేరారు. వీరిద్దరూ మసూద్‌కు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినవారే. అయితే పంజ్‌షేర్ తాలిబన్ల వశమైతే వీరి ఆలోచనలు మారే అవకాశం ఉంది. సైనిక చర్యల కన్నా, రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నూర్ ఇప్పటికే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం.