తెలంగాణ

telangana

ETV Bharat / international

దేశాన్ని​ వీడిన అఫ్గాన్​ అధ్యక్షుడు ఘనీ!

Afghanistan President Ashraf Ghani
అఫ్గాన్​ అధ్యక్షుడు, అష్రఫ్​ ఘనీ

By

Published : Aug 15, 2021, 7:21 PM IST

Updated : Aug 15, 2021, 10:42 PM IST

19:14 August 15

దేశాన్ని​ వీడిన అఫ్గాన్​ అధ్యక్షుడు ఘనీ!

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ.. దేశాన్ని​ వీడివెళ్లారు. ఈ మేరకు అఫ్గాన్​ మాజీ అధ్యక్షుడు హమీద్​ కారాజై కార్యాలయం, అఫ్గాన్​ భధ్రతా మండలి కార్యాలయానికి చెందిన ఓ ఇద్దరు అధికారులు మీడియాకు వెల్లడించారు.

జాతీయ భద్రతా సలహాదారు హముదుల్లా మోహిబ్​తో కలిసి.. ఘనీ దేశాన్ని వీడి వెళ్లారని వారు చెప్పారు. అయితే.. అష్రఫ్​ ఘనీ ఎక్కడకు వెళ్లారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ, ఆయన తజికిస్థాన్​కు వెళ్లారని సమాచారం. కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి మరో దేశం వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అతికొద్ది రోజుల్లోనే అఫ్గానిస్థాన్​లోని కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆదివారం రాజధాని కాబుల్​లోకి ప్రవేశించారు. అఫ్గాన్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. దీంతో.. అఫ్గాన్​ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్‌ జలాలీని నియమించినట్లు తాలిబన్లు ప్రకటించారు. 

పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి..

కాబూల్‌లో పరిస్థితులపై అఫ్గాన్‌ అధ్యక్ష కార్యాలయం ట్వీట్‌ చేసింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పింది. 

"కాబూల్‌లో పలుచోట్ల నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. భద్రతా దళాలు అంతర్జాతీయ భాగస్వాములతో పనిచేస్తున్నాయి"  

-అఫ్గాన్​ అధ్యక్ష కార్యాలయం

అమెరికా అప్రమత్తం..!

అఫ్గాన్‌ తాలిబన్ల వశం కావడం వల్ల అమెరికా అప్రమత్తమైంది. తమ సిబ్బందిని తరలించేందుకు మరిన్ని బలగాలను ఆ దేశానికి పంపింది.  తమ రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానాల్లో తరలించింది. కాబూల్‌ విమానాశ్రయం నుంచి అమెరికా ప్రధాన బృందం పనిచేస్తోంది.  

మరోవైపు.. తమ పౌరులను కాపాడుకునేందుకు బ్రిటన్​ సైన్యాన్ని పంపింది. ఐరోపా సమాఖ్య సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

ఐరాస ఆందోళన..

తాలిబన్ల దురాక్రమణపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని తెలిపింది.  అఫ్గాన్‌ను ఒంటరి దేశంగా మార్చుతుందని పేర్కొంది.  

మరోవైపు.. తాలిబన్ల హింస నేపథ్యంలో ఐరాస అత్యవసర భేటీ ఏర్పాటు చేసిందని రష్యా తెలిపింది. 

Last Updated : Aug 15, 2021, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details