Afghanistan Poverty Facts: కుటుంబాలకు పట్టెడన్నం పెట్టడం కోసం అఫ్గాన్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న తమ చిన్నారుల కడుపు నింపేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు. చేసేందుకు పని లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. దిక్కుతోచని స్థితిలో.. తమ శరీర అవయవాలను విక్రయిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లల ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చిన్నారుల రేపటి భవిష్యత్తు కోసం నేటి తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు.
"నేను బయటకు వెళ్లి డబ్బు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని విక్రయించాను. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా ఆహారాన్ని అందిస్తాను కదా."
-గులాం హజ్రత్, కిడ్నీని విక్రయించిన వ్యక్తి
తాలిబన్ల పాలనలో..
Afghan Poverty Rate: కుటుంబాన్ని పోషించేందుకు గులాం హజ్రత్ తన కిడ్నీని లక్షా 69 వేల రూపాయలకు అమ్మేశాడు. అఫ్గానిస్తాన్‌లో చాలామంది తండ్రుల వ్యథ ఇదే పరిస్థితిలో ఉంది. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి అఫ్గాన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అఫ్గాన్‌లో గుక్కెడు గింజలు దొరక్క ప్రజలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు కిడ్నీలను విక్రయిస్తున్నారు. తాలిబన్ల పాలనలో కఠిన పేదరికంలోకి జారుకున్న అఫ్గాన్లు.. ముఖ్యమైన అవయవాలను అమ్ముకునేందుకు వెనకాడటం లేదు. హెరాత్ ప్రావిన్స్‌లో కిడ్నీల విక్రయం ఎక్కువగా సాగుతోంది
తాలిబన్లు ఆక్రమించుకున్న నాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థ వారి పాలనలో మరింత దిగజారింది. ఈ కఠిన పరిస్థితుల్లో అఫ్గన్లు అత్యంత దుర్బల జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కఠిక పేదరికంలో కుటుంబానికి ఆహారం పెట్టేందుకు అవయవాలు అమ్మేస్తున్నారు. కిడ్నీ దాత , కొనుగోలుదారు పరస్పర అంగీకారంతో కిడ్నీలు విక్రయిస్తున్నారు.