తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్ల ఆక్రమణతో మళ్లీ చీకటిరాజ్యం! - afghanistan taliban rule problems

మధ్యయుగాల ఛాందస పాలనా పద్ధతుల అమలులో ఘనచరిత్ర కలిగిన తాలిబన్లు మళ్లీ అఫ్గాన్‌ పీఠమెక్కారు. కీలక నగరాలను కైవసం చేసుకొంటూ మెరుపు వేగంతో ఆ దేశ రాజధానిలో పాగావేశారు. కశ్మీర్‌లో లోగడ పట్టుబడిన ఉగ్రవాదుల్లో తాలిబన్లు ఉన్నారంటున్న మాజీ సైన్యాధికారులు- ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ఆవిర్భావం భారత్‌కు పక్కలో బల్లెమేనని హెచ్చరిస్తున్నారు.

afghanistan
అఫ్గాన్‌

By

Published : Aug 17, 2021, 5:41 AM IST

Updated : Aug 17, 2021, 6:55 AM IST

'సాటి మనుషుల పట్ల ప్రేమరహితులైన వారెవరికీ మతమంటే ఏమిటో తెలియదు' అంటూ మానవత్వాన్ని అభివర్ణించిన సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ కర్మభూమి.. అఫ్గానిస్థాన్‌. ఆ అహింసామూర్తి ప్రబోధాలకు తిలోదకాలిచ్చి హింసోన్మాదాన్ని తలకెక్కించుకొన్న అనాగరిక మూక.. తాలిబన్‌! మధ్యయుగాల ఛాందస పాలనా పద్ధతుల అమలులో ఘనచరిత్ర కలిగిన ఆ ముష్కరులు మళ్ళీ అఫ్గాన్‌ పీఠమెక్కారు. మొన్నటి దాకా మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ- ఆఖరి క్షణంలో పలాయనం చిత్తగించారు. తాలిబన్ల రాజకీయ విభాగాధిపతి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు పట్టాభిషేకం లాంఛనమేనని అంటున్నారు!

రోజుల వ్యవధిలోనే..

కాబూల్‌ మూడు నెలల్లో కూలిపోవచ్చని అమెరికా నిఘావర్గాలు ఇటీవల అంచనా కట్టాయి. కీలక నగరాలను కైవసం చేసుకొంటూ మెరుపు వేగంతో కదిలిన తాలిబన్‌ తండాలు- రోజుల వ్యవధిలోనే రాజధానిలో పాగావేశాయి. అఫ్గానీల ధన మాన ప్రాణాలకు ఇక అవే పూచీ వహించాలని అరవైకి పైగా దేశాలు సమష్టి ప్రకటన విడుదల చేశాయి. సాధారణ పౌరులకు ఎటువంటి హానీ తలపెట్టవద్దని ఐరాస భద్రతామండలి తాజాగా పిలుపిచ్చింది. తాలిబన్లతో స్నేహ సంబంధాలను ఆకాంక్షిస్తున్నామంటూ చైనా అప్పుడే అత్యుత్సాహం కనబరచగా, ఊహించినట్లుగానే అఫ్గాన్‌ పరిణామాలను పాకిస్థాన్‌ స్వాగతించింది. కాబూల్‌పై బలవంతంగా అధికారం చలాయించడానికి అంగీకరించబోమని ఇటీవల స్పష్టంచేసిన ఇండియా- అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఆగమేఘాలపై స్వదేశానికి తరలించే యత్నాల్లో నిమగ్నమైంది. తాలిబన్‌ తోడేళ్ల పాలబడిన గాంధార భూమిలో మానవహక్కులు మంటగలిసిపోతున్నాయి. పాఠశాల విద్యార్థుల్లో 42శాతంగా ఉన్న బాలికలు, పార్లమెంటు దిగువసభలో 30శాతం స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, వృత్తి వ్యాపారాల్లో రాణిస్తున్న యువతుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. బైడెన్‌ యంత్రాంగ వ్యూహరాహిత్యం, అఫ్గాన్‌ పౌర ప్రభుత్వ నిస్సహాయత, సైనిక దళాల అసమర్థత... వెరసి- కొలువుతీరిన తాలిబన్ల రాజ్యం ఉగ్రవాదులకు స్వర్గధామం కాబోతోందన్నదే అందరి ఆందోళన!

వారికి చెవికెక్కవవి!

అభివృద్ధి పథంలో అఫ్గానిస్థాన్‌ పయనం కొనసాగాలని ప్రధాని మోదీ ఆరు నెలల క్రితమే ఆశాభావం వ్యక్తంచేశారు. ఇరుగుపొరుగు దేశాల్లో మంటలు రాజేయడానికి అఫ్గాన్‌ గడ్డ నెలవు కాకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇటీవల ఆకాంక్షించారు. పాకిస్థాన్‌ ప్రత్యక్ష మద్దతు, చైనా పరోక్ష దన్నుతో అధికారంలోకి వచ్చిన తాలిబన్లకు ఈ హితవచనాలు చెవికెక్కవన్నది నిష్ఠురసత్యం! మానవతాదృక్పథంతో 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించి అఫ్గానిస్థాన్‌లో 500 అభివృద్ధి ప్రాజెక్టులను తలకెత్తుకొన్న ఇండియాపై ముష్కర మూకలు విషం కక్కుతూనే ఉన్నాయి. సల్మా డ్యామ్‌తో సహా ప్రధాన ప్రాజెక్టులపై దాడులకు తెగబడుతున్నాయి. 150 కోట్ల డాలర్లకు చేరిన ఇండియా-అఫ్గాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యంపైనా తాలిబన్ల దుష్ప్రభావం తప్పదన్న వార్తలు వినవస్తున్నాయి.

భారత అంతర్గత భద్రతపై..

భారత్‌కు కీలకమైన 'తాపీ' గ్యాస్‌ పైప్‌లైన్‌ సైతం సమస్యల్లో పడబోతోందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్లతో భారత అంతర్గత భద్రతకూ ప్రమాదమేనన్న భయసందేహాలూ నెలకొన్నాయి. కశ్మీర్‌లో లోగడ పట్టుబడిన ఉగ్రవాదుల్లో తాలిబన్లు ఉన్నారంటున్న మాజీ సైన్యాధికారులు- ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ ఆవిర్భావం భారత్‌కు పక్కలో బల్లెమేనని హెచ్చరిస్తున్నారు. తాలిబన్ల ఏలుబడిలో అల్‌ఖైదాతో పాటు ఇతరేతర ఉగ్రవాద సంస్థలూ బలం పుంజుకొంటే- మొత్తం ప్రపంచానికే ఉగ్రవాద ముప్పు తప్పదని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిత్రదేశాలతో కలిసి నడుస్తూనే అఫ్గాన్‌లో తన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇండియా అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన తరుణమిది. దేశభద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకొంటూనే- కొత్త శత్రువును సమర్థంగా ఎదుర్కొనేలా విదేశాంగ విధానానికి పదునుపెట్టాలి!

ఇవీ చూడండి:

Last Updated : Aug 17, 2021, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details