అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు (Afghanistan Taliban).. తొలి రోజు నుంచే మహిళా హక్కులను(Afghanistan women) కాలరాస్తున్నారు. మొదటి నుంచి భయపడినట్లుగానే రెండు దశాబ్దాల నాటి చీకటి రోజులను గుర్తు చేస్తున్నారు. మహిళలపై కఠిన ఆంక్షలు(Afghanistan women) విధిస్తున్నారు. అఫ్గాన్ నుంచి బయటపడిన మహిళలు.. అక్కడి పరిస్థితులను వివరిస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 'తాలిబన్లు మహిళలను కనీసం మనుషుల్లానే భావించటం లేదు' అని అఫ్గాన్‌కు చెందిన పరిశోధకురాలు, హక్కుల కార్యకర్త హుమెరా రిజాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిలో తానూ ఒక్కరినని చెప్పారు.
" గతంలో తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు మహిళలపై దాడులు, హత్యలు చేశారు. మహిళల హక్కులను కాలరాశారు. 2000 సంవత్సరం నుంచి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో శ్రమపడ్డారు. ఇప్పుడు ఆ శ్రమంతా వృథా అయ్యింది"
- హుమెరా రిజాయ్, హక్కుల కార్యకర్త.
దిల్లీలో భారతీయ మహిళా ప్రెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జర్నలిస్టుల(Afghanistan women) సమావేశంలో.. అఫ్గాన్‌లోని పరిస్థితులను(Afghanistan crisis) వివరించారు ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలు షింకాయ్ కరోఖైల్.
"అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. దేశంలో చాలా మంది మహిళా కార్యకర్తలు, రాజకీయ నేతలు చిక్కుకుపోయారు. తాలిబన్లు వాళ్ల ఇళ్లకు వెళ్లి భయపెడుతున్నారు. వారి భద్రతా సిబ్బంది ఆయుధాలు లాక్కుంటున్నారు. వాళ్ల వద్ద ఉన్న కార్లను సైతం తీసుకెళ్తున్నారు. మహిళలు పారిపోయేలా చేయటం లేదా గొంతు ఎత్తకుండా చేసేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. "