అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) హస్తగతం చేసుకునే క్రమంలో దేశం విడిచి వెళ్లిపోవటాన్ని సమర్థించుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(Ashraf ghani news), రక్తపాతాన్ని నివారించేందుకే అలా చేశానని పునరుద్ఘాటించారు. దేశ సంపద నుంచి మిలియన్ల డాలర్లు దొంగిలించారని తజకిస్థాన్‌లోని అఫ్గాన్ రాయబారి ఆరోపించటాన్ని ఖండించారు. తన ఫేస్బుక్ పేజీలో బుధవారం అర్ధరాత్రి ఓ వీడియోను షేర్ చేశారు ఘనీ. ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉన్నట్లు వెల్లడించారు.
త్వరలో వస్తా..
అయితే యూఏఈలోనే ఉండిపోనని, అఫ్గాన్‌కు తిరిగి వస్తానని ఘనీ సూచనప్రాయంగా తెలిపారు. తాలిబన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో తన మద్దతుదారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దేశానికి వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
వీడియో సందేశంలో అఫ్గాన్ భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు ఘనీ. శాంతి స్థాపనలో విఫలమవటమే తాలిబన్లు(Taliban news) అధికారాన్ని లాక్కునేందుకు దారితీసిందన్నారు. 169 మిలియన్ల డాలర్లు దేశ సంపదను దోచుకుని పారిపోయాడన్న ఆరోపణలను పరోక్షంగా తిప్పికొట్టారు ఘనీ. ' ఒక జత సంప్రదాయ దుస్తులు, ఒంటిపై ఉన్న చొక్కా, చెప్పులతోనే దేశం విడిచాను. డబ్బులు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఆరోపణలు నిరాధారమైనవి.' అని పేర్కొన్నారు.
''నా స్వార్థం చూసుకుని వెళ్లలేదు. దేశం మంచి కోసమే వీడాల్సి వచ్చింది. అలాగైనా ఈ రక్తపాతం, అల్లర్లు ఆగుతాయని అనుకున్నా. ప్రస్తుతం నేను ఎమిరేట్స్‌లో(యూఏఈ) ఉన్నాను. నేను మిమ్మల్ని(అఫ్గాన్ ప్రజలను ఉద్దేశిస్తూ) అమ్మేసి పారిపోయానని, పెద్ద మొత్తంలో డబ్బులు తరలించానని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అఫ్గానిస్థాన్ నుంచి ఎలా వెళ్లాల్సి వచ్చిందంటే.. కనీసం నా కాళ్లకున్న చెప్పులు మార్చుకునే అవకాశం కూడా రాలేదు. తీవ్రమైన ముప్పు ఉందని నా భద్రతా సిబ్బంది చెప్పడంతో ఆలోచించుకునే అవకాశం కూడా లేకపోయింది. వెంటనే అధ్యక్ష భవనం నుంచి వెళ్లిపోయాను. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వచ్చేశాను. కావాలంటే ఈ విషయాన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతో కూడా ధ్రువీకరించుకోవచ్చు. నేను అక్కడే ఉంటే అఫ్గాన్ ప్రజల కళ్లముందే ఓ అధ్యక్షుడు ఉరికి వేలాడాల్సి వచ్చేది.''
- అష్రఫ్ ఘనీ, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు
రూ.1,255 కోట్లతో ఘనీ పరార్
అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశ ఖజానా నుంచి రూ.1,255 కోట్లు(169 మిలియన్ అమెరికన్ డాలర్లు) తస్కరించారని, ఇంటర్‌పోల్ తక్షణం ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ తజకిస్థాన్‌లోని అఫ్గాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అఘ్‌బార్ బుధవారం డిమాండ్ చేశారు. దేశ కోశాగారం నుంచి నిధులు కొల్లగొట్టిన ఘనీ, ఓ విద్రోహిలా యూఏఈకి పరారైనట్లు తెలిపారు. ఈ విషయమై ఇంటర్‌పోల్‌కు తాను వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.
ఇదీ చూడండి:యూఏఈలో అష్రఫ్ ఘనీ- అరెస్టు కోసం అఫ్గాన్ ప్రయత్నాలు