'సంగీత కచేరీలు, పాటల ప్రోగ్రామ్‌లు బంద్.. సంగీత పాఠశాలలు, సంబంధిత కార్యాలయాలు మూసివేత.. మ్యూజిక్ అనే పదానికే స్వస్తి.. స్టోర్ రూముల్లో సంగీత వాయిద్యాలు.. మారు వేషాల్లో కళాకారులు.. ప్రాణ భయంతో పరాయి దేశాలకు వలసలు..' ఇది అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితి(Afghanistan crisis).
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) తమ అధీనంలోకి తెచ్చుకున్న క్రమంలో.. అక్కడి కళాకారుల(Afghan musicians) పరిస్థితి దారుణంగా మారింది. వారి పాలనపై భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ అఫ్గాన్ సంగీతకారులు.. కాబుల్‌లోని తమ కార్యాలయాలను మూసివేస్తున్నారు. అక్కడి కళాకారులు ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. సంగీత కార్యక్రమాలు రద్దవుతున్నాయి. సంగీత పరిశ్రమ తీవ్ర నష్టాలు చవిచూస్తోంది.
సెప్టెంబర్ 6న పంజ్‌షేర్ ప్రావిన్స్‌ను(panjshir valley) సైతం తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పూర్తి అఫ్గాన్ తమ వశమైనట్లు వెల్లడించారు. అప్పటి నుంచి సంగీత కళాకారులు తమ వాయిద్యాలను ఇంటికి తెచ్చేసుకోవటం లేదా స్టోర్ రూముల్లో పడేయటం చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం మాదిరిగా మ్యూజిక్‌పై నిషేధం విధిస్తారా? లేదా అనుమతిస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భయంతో కొందరు గాయకులు పాకిస్థాన్‌కు వలస వెళ్తున్నారు.
" కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించికున్న తర్వాత.. నా వేషధారణ మార్చుకుని పెషావర్‌కు వచ్చేశాను. తాలిబన్లతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. వారిని మా సోదరులుగానే భావిస్తున్నాం. కానీ, మా వృత్తి వారికి నచ్చదు కాబట్టి వారి పాలనలో మాకు రక్షణ లేదు. "
- అజ్మల్, గాయకుడు.