అఫ్గానిస్థాన్‌లోని తూర్పు హెరాత్ ప్రావిన్స్‌లో కారు బాంబు పేలి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 47మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక సైనికుడు కూడా ఉన్నాట్లు దేశ అంతర్గత భద్రత అధికార ప్రతినిధి తారిఖ్ అరైన్ తెలిపారు.
బాంబు పేలుడుతో 14 ఇళ్లు ధ్వంసమయ్యాయని.. చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారని.. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఇటీవల జరిగిన అనేక దాడులకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది.
ఐరాస ఆందోళన..
ఇటీవలి కాలంలో పౌరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస భద్రతా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అప్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ ఘటనలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు, న్యాయవ్యవస్థ, మీడియా, ఆరోగ్య సంరక్షణ, లక్ష్యంగా ఈ దాడులు జరగుతున్నాయని భద్రతా విభాగం పేర్కొంది. మహిళలు, మానవ హక్కుల పరిరక్షకులతో పాటు.. జాతి, మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది.
మరోవైపు శాంతి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలను దెబ్బతీసేందుకే ఈ తరహా దాడులు జరుగుతున్నట్లు తాలిబన్, అఫ్గాన్ ప్రభుత్వం పరస్పర విమర్శలకు చేసున్నాయి.
ఇదీ చదవండి:అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు- ఐదుగురు మృతి