అఫ్గానిస్థాన్లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది(afghan crisis 2021). తాలిబన్ల ఆక్రమణతో అంతర్జాతీయ సమాజం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడి.. అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు.. జీతాలు అందక దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. వైద్య పరికరాలు, మందుల కొరత కారణంగా రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
రోగుల ఆర్తనాథాలను వైద్యులు తట్టుకోలేకపోతున్నారు(afghan hospital kabul). తమను అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని.. తక్షణమే సహాయం చేయాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులది కూడా ఇదే దుస్థితి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు నెల రోజులుగా మూతపడే ఉన్నాయి. అందువల్ల ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. తిరిగి ఉద్యోగాల్లో చేరాలని తాలిబన్లు పిలుపునిచ్చినా, వేతనాలు, తాలిబన్ల పాలనపై అందరిలో ఆందోళన నెలకొంది.
"మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఇది మా మీద చాలా ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా మాకు జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులపై చాలా భారం పడుతోంది. అఫ్గానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ, మా వేతనాలు అన్నీ అంతర్జాతీయ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. దురదృష్టవశాత్తు అమెరికా నిధులను ఆపేసింది. చాలా కష్టంగా ఉంటోంది."
--- నూరుల్లాన్ హజ్రాటీ, ప్రభుత్వ ఉద్యోగి.
తాలిబన్లు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, విధివిధానాలను ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వాన్ని నడిపేందుకు అసలు తాలిబన్ల వద్ద ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో అలజడులు సృష్టిస్తోంది.