Covid Booster dose mandatory: ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులు, పర్యటకులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా ఈ జాబితాలో చేరింది.
యూఏఈ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే.. బూస్టర్ డోసు తప్పనిసరి చేసింది అక్కడి అధికార యంత్రాంగం. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు అందుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు పరిగణించనున్నట్లు వెల్లడించింది. అబుదాబిలో ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి టీకా స్థితిని తెలియజేసే.. గ్రీన్ పాస్‌ను చూపించాలి.
విదేశీ పార్శిల్స్ వల్లే కొత్త కేసులు
విదేశాల నుంచి వస్తున్న పార్శిల్స్ వల్లే తమ దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయని చైనా అధికారిక మీడియా పేర్కొంది. విదేశాల నుంచి వస్తున్న పార్శిల్స్‌కు పెరుగుతున్న కొత్త కేసులకు సంబంధముందని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రంలోని వైరాలజిస్టులు తెలిపినట్లు వివరించింది.
Covid deaths in Australia
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా, క్వీన్స్లాండ్ రాష్ట్రాల్లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మంగళవారం ఒక్కరోజే 74 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ కేసులు భారీగా పెరగడం సహా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వైరస్ బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
Corona restrictions in Japan
ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధించిన ఆంక్షలను మరింత కాలం పొడిగించాలని యోచిస్తోంది జపాన్ సర్కారు. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుని.. శుక్రవారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే జరిగితే.. ఒకినావా, యమగుచి, హిరోషిమాతో సహా 16 ప్రాంతాల్లో మరో మూడువారాలు పాటు కొవిడ్ ఆంక్షలు కొనసాగుతాయి.
Sputnik vaccine efficacy omicron
ఒమిక్రాన్‌పై స్పుత్నిక్-వి టీకా 75 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని రష్యాలోని గమలేయా పరిశోధన కేంద్రం అధిపతి అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆరు నెలల్లో స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోసును తీసుకుంటే.. ఒమిక్రాన్ నుంచి 100 శాతం రక్షణ పొందవచ్చని వెల్లడించారు. అయితే రీవ్యాక్సినేషన్ చేయకపోతే ఆ సామర్థ్యం 56-57 శాతానికి తగ్గుతుందని గింట్స్‌బర్గ్ తెలిపారు. ఒమిక్రాన్ సోకితే స్పుత్నిక్-వి ప్రభావం ఎనిమిది రెట్లు తగ్గుతుందని.. అయినప్పటికీ ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
ఒమిక్రాన్‌పై పాక్షికంగానే నాలుగో టీకా డోసు ప్రభావం
కొవిడ్ టీకా నాలుగో డోసుతో యాంటీబాడీలు పెరుగుతాయని.. కానీ ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పాక్షిక రక్షణను మాత్రమే లభిస్తుందని ఇజ్రాయెల్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. వివిధ టీకాల కాంబినేషన్లో టీకాల సమర్థత, భద్రతను పరీక్షించి.. యాంటీబాడీల పెరుగుదల రేటును విశ్లేషించగా.. ఈ విషయం తెలిసింది.
'వైరస్ సోకిన జంతువుల చంపేస్తాం'
హాంకాంగ్‌లో కొవిడ్ సోకిన వ్యక్తి పని చేసిన ఓ పెంపుడు జంతువుల దుకాణంలో ఎలుకలు సహా 2,000 జంతువులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వాటిని చంపేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు నగరం చిట్టెలుక విక్రయాలు, చిన్న క్షీరదాల దిగుమతిని కూడా నిలిపివేశారు.
ఇదీ చూడండి:రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!