ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్ లీక్ వివాదంలో ముందు నుంచి కేంద్రబిందువుగా మారిన చైనా ప్రముఖ వైరాలజిస్టు, బ్యాట్ ఉమన్ షీ ఝెంగ్లీ ఎట్టకేలకు ఈ వాదనలపై స్పందించారు. ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. కరోనా విపత్తుకు తమ సంస్థ కారణం కాదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్‌కు అరుదైన ఇంటర్వ్యూ ఇచ్చారు.
అలాంటివి ల్యాబ్‌లో జరగలేదు..
"అసలు ఈ భూమ్మిద రుజువులే లేనిదానికి సాక్ష్యాలు ఇస్తానని నేనెలా చెప్పగలను? అమాయకమైన శాస్త్రవేత్తలపై ప్రపంచం ఎలా దుమ్మెత్తిపోయగలుగుతుందో నాకు అర్థం కావట్లేదు"అని షీ ఝెంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ల సామర్థ్యాన్ని పెంచే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రయోగాలను వుహాన్ ల్యాబ్ ఎన్నడూ జరపలేదని, అలాంటి వాటికి సహకారం కూడా అందించలేదని చెప్పారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ ఉన్న గబ్బిలాలపై తన ప్రయోగాలు.. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ లాంటివి కావని, ఎందుకంటే వైరస్‌ను మరింత ప్రమాదరకంగా మార్చే పరిశోధనలేవీ తాను చేయలేదని తెలిపారు. కేవలం ఈ వైరస్ రకాలు ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకునేందుకు మాత్రమే ప్రయోగాలు జరిపామన్నారు.
మరోవైపు కరోనాకు ముందు 2019 నవంబరులో వుహాన్ ల్యాబ్‌లోని కొందరు అనారోగ్యానికి గురైనట్లు వచ్చిన వార్తలను కూడా ఝెంగ్లీ తోసిపుచ్చారు. తమ ల్యాబ్‌లో అలాంటి కేసులేమీ వెలుగుచూడలేదని చెప్పిన ఆమె.."సాధ్యమైతే ఆ సిబ్బంది పేర్లు చెప్పండి మేం చెక్ చేస్తాం" అని చెప్పారు.
కరోనా మూలాలపై దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తమ ల్యాబ్ పూర్తి సహకారం అందించిందని ఆమె అన్నారు. తమపై ఉన్న అపనమ్మకం కారణంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని బ్యాట్ ఉమన్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
మానవాళికి ప్రమాదం..