కొవిడ్-19 మూలాలపై విచారించేందుకు వచ్చే జనవరిలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాను సందర్శించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం అధికారికంగా వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి హెడిన్ హాల్‌డర్సన్ ఓ మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. కొవిడ్ వైరస్ ఎక్కడ పుట్టిందనే విషయంపై నిపుణుల బృందం విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఏడాది కాలం పూర్తయింది. ఇప్పటివరకూ ఆ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా బాధితులను బలితీసుకుంది. అంతేకాకుండా ఏడు కోట్లకు పైగా జనం దాని బారిన పడ్డారు. అయితే ఈ వైరస్ ఎక్కడ పుట్టింది? అనే విషయం మాత్రం సర్వత్రా మిస్టరీగా ఉండిపోయింది. ఆ విషయాల్ని కనుగొనేందుకు చైనాకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పంపే విషయమై డబ్ల్యూహెచ్‌ఓ నెలల తరబడి పనిచేస్తోంది.