బడికి వెళ్లే వయస్సులో పిల్లలను ఎవరైనా కించపరిచినా.. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపి ఎగతాళి చేసినా భరించలేరు. మరుసటి రోజు నుంచి బడికి వెళ్లబోమని మారాం చేస్తారు. భయపడిపోతారు కూడా. గాయపడిన ఆ పసి హృదయాలు ఆవేశంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాయి. ఆస్ట్రేలియాలో ఓ బాలుడి విషయంలో అదే జరిగింది. తొమ్మిదేళ్ల క్వాడెన్ బేలెస్ అనే విద్యార్థి పాఠశాలలో తనకెదురైన అనుభవంపై ఆవేదనతో చేసిన వ్యాఖ్యల వీడియో గుండెల్ని పిండేస్తోంది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
ఆస్ట్రేలియాలోని మర్రాకా బేలెస్‌కు తొమ్మిదేళ్ల క్వాడెన్ బేలెస్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడికి జన్యుపరమైన లోపం ఉంది (అచోండ్రాప్లాసియా). దీంతో ఎత్తు చాలా తక్కువగా ఉంటాడు. అయితే, పొడుగ్గా లేడంటూ పాఠశాలలోని తోటి విద్యార్థులు అతడిలోని శారీరక లోపాన్ని ఎగతాళి చేశారు. దీంతో క్వాడెన్ తన కారులో కూర్చొని ‘నా గుండెల్లో కత్తితో పొడుచుకోవాలని ఉంది. నన్ను ఎవరైనా చంపేయండి’’ అంటూ ఎంతో బాధతో కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియోను అతడి తల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితి ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు అలాంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలనే విషయాన్ని వివరిస్తూ ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఆ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. తన కుమారుడు చేసిన ఆత్మహత్యా ప్రయత్నాలను కూడా ఇందులో ప్రస్తావించారు. తన కుమారుడికి ఎదురైన ఈ ఘటన తమ కుటుంబాన్ని ఎంతగానో కలిచి వేస్తోందని, తన కొడుకు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడేమోనని నిరంతరం కాచుకొని ఉంటున్నట్టు చెబుతూ ఆమె విలపించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గురించి పాఠశాలలు మిగతా పిల్లలకు అవగాహన కల్పిస్తే తన కొడుకులా ఇంకెవరూ ఇలాంటి అవమానానికి గురికారని ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.