తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ సైనికుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పటిలో సమసిపోయే సూచనలు కనిపించడంలేదు. సరిహద్దులకు ఇరువైపులా రెండు దేశాల సైనికుల మోహరింపు రానున్న శీతాకాలంలోనూ కొనసాగే అవకాశమే మెండుగా ఉంది.
80 నిమిషాల్లో 300 వంటకాలు
ఈ నేపథ్యంలో అత్యంత కఠిన పరిస్థితలు ఉండే హిమాలయాల్లో విధులు నిర్వహించే తమ జవాన్లకు ఎలాంటి ఆలస్యం జరగకుండా వేడివేడి ఆహార పదార్థాలను అందించేందుకు చైనాకు చెందిన ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జూన్ నెల నుంచి ఆర్మీలోని వంట విభాగానికి చెందిన 8 మందికి హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో శిక్షణను నిర్వహిస్తోంది. ఆహారంలో పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే 80 నిమిషాల్లో 300 రకాల వంటకాలను సిద్ధం చేసేలా తర్ఫీదునిస్తున్నారని చైనా అధికార పత్రిక ఒకటి వెల్లడించింది.