పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 74కు చేరింది. కరాచీ-రావల్పిండి తేజ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్ వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా.. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో తాజాగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. రహీం యార్ ఖాన్ సమీపంలోని లియాఖత్పుర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రైలులోని మూడు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 10 అగ్నిమాపక యంత్రాలు ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సైనిక విమానాలలో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిలిండర్ల వల్లే పేలుడు:మంత్రి
క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇస్లాం మత భోదకులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
'ప్రమాద బాధితుల్లో చాలా వరకు ఇస్లాం భోదకులే ఉన్నారు. వారంతా లాహోర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించి ప్రయాణికులు అల్పాహారం తయారు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రెండు స్టవ్‌లు పేలి మంటలు చెలరేగాయి. రైలు వేగంగా వెళ్తున్నందున మంటలు అతి త్వరగా వ్యాపించాయి. ప్రయాణికులు పొయ్యి వాడొద్దని గార్డు హెచ్చరించారు. అయినా వారు వినకుండా సిలిండర్ వినియోగించారు. మంటలు చెలరేగిన తర్వాత రైలు నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది మరణించారు.'
-షేక్ రషీద్ అహ్మద్, పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి