తెలంగాణ

telangana

ETV Bharat / international

గణితంలో చిన్నారి సూపర్ టాలెంట్​- 1,560 డిజిట్స్ గుర్తుంచుకుని... - mathematical record of kid in singapore

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. కానీ, తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అరుదైన రికార్డు సాధించింది. పై విలువలోని 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసి, సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో(Singapore Book Of Records) స్థానం సంపాదించింది. అంతకుముందు సింగపూర్​కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును బద్ధలు గొట్టింది.

Singapore Book Of Records
సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్

By

Published : Oct 17, 2021, 4:50 PM IST

భారత సంతతికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఇషానీ షణ్ముగం.. అరుదైన ఘనత సాధించింది. గణితంలో అసాధారణమైన ప్రతిభ చూపి సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది. 'పై' విలువలోని 1,560 దశాంశ స్థానాలను(డెసిమల్ ప్లేసెస్​)(Pi Decimal Places Record) గుర్తుంచుకుని చెప్పి, సింగపూర్​వాసి పేరు మీదున్న ఈ రికార్డును బద్ధలు గొట్టింది.

అక్టోబర్​ 13న తమ ఇంట్లో కూర్చుని, 'సింగపూర్ బుక్​ ఆఫ్ రికార్డ్స్'(Singapore Book Of Records) ప్రతినిధుల ముందు, పది నిమిషాల పాటు ఏకధాటిగా అంకెలను చెప్పింది ఇషానీ షణ్ముగం. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఇషానీ పేరిట రికార్డు నమోదు చేశారు.

చాలా ప్రశాంతంగా..

"ఈ కార్యక్రమం జరిగేటప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. కానీ, ఇషానీ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పరిశీలకులు.. 'ఏమైనా ఇబ్బందిగా ఉందా' అని తనను ప్రశ్నించగా.. 'అలాంటిదేం లేదు నేను చాలా ఆత్రుతగా ఉన్నాను' అని చెప్పింది. ఆ తర్వాత విజయవంతంగా కార్యక్రమం(Singapore Book Of Records) పూర్తి చేసింది" అని ఇషానీ షణ్ముగం తల్లి వెన్నెల మునుస్వామి తెలిపారు.

గతేడాది సెప్టెంబరులో 'పీసీఎఫ్​ స్పార్క్​లెటాట్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఇషానీ.. పై విలువలోని 409 స్థానాలను గుర్తుపెట్టుకుని చెప్పింది. అయితే.. తాను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నానని కోరగా.. ఆమెకు మరిన్ని అంకెలను నేర్పామని ఇషానీ తల్లిదండ్రులు వివరించారు. ఓ బ్యాంకులో టెక్​ మేనేజర్​గా పని చేసే ఇషానీ తండ్రి వీఎస్​ షణ్ముగం, తన భార్యతో కలిసి ఇషానీకి ఏప్రిల్​ నుంచి ప్రతిరోజు కొన్ని అంకెలను నేర్పారు.

రెండేళ్లప్పుడే..

"ఇషానీని చూస్తే మాకెంతో గర్వంగా ఉంది. తన మొదటి ప్రయత్నంలోనే అన్ని అంకెలను గుర్తుపెట్టుకుని చెబుతుందని మేం ఊహించలేకపోయాం. కానీ, తాను రికార్డును బద్ధలు గొట్టాక.. మా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి" అని వీఎస్​ షణ్ముగం చెప్పారు. రెండేళ్ల వయసులోనే ఇషానీకి అద్భుతమైన జ్ఞాపకశక్తి సామర్థ్యం ఉందని తామ గుర్తించామని వెన్నెల మునుస్వామి తెలిపారు.

"ఇషానీ తనంతట తానుగానే కథల పుస్తకాలు.. ఒకదాని తర్వాత మరొకటి చదవగలిగేది. ప్రపంచ దేశాల జెండాలు ఉన్న ఫ్లాష్​కార్డులను మేం చూపించేవాళ్లం. అలా 195 దేశాల జాతీయ పతాకాలను తను గుర్తుపెట్టుకునేది. అప్పుడు ఇషానీకి విజ్ఞాన శాస్త్రం, భౌగోళిక విషయాలపై ఆసక్తి ఉందని మాకు అర్థమైంది. జియోగ్రాఫికల్​ టీవీలో కార్యక్రమాలను చూసి, తను మాకు వాటి గురించి చెబుతూ ఉండేది. మేం తనను ఎప్పుడూ ఇదే నేర్చుకోవాలి అని ఒత్తిడికి గురి చేయలేదు. తన ఆసక్తులకు తగ్గట్టుగా మేం వాటికి సాయం చేసేవాళ్లం అంతే.

-వెన్నెల మునుస్వామి, ఇషానీ తల్లి.

ఇషానీ ప్రస్తుతం.. పియానో నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తోందని వెన్నెల మునుస్వామి తెలిపారు. అయితే.. 'పై' అంకెలను గుర్తుంచుకోవడం వదిలేయదని చెప్పారు. ఇషానీ మరిన్ని అంకెలను నేర్చుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు.

2018లో 1,505 సంఖ్యలను గుర్తుపెట్టుకుని చెప్పిన సాన్సీ సూరజ్ అనే మెమరీ ట్రైనర్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఇషానీ బద్ధలుగొట్టింది.

కాగా.. 'పై'లో 70వేల దశాంశ స్థానాలను గుర్తుపెట్టుకుని చెప్పి, భారత్​లోని వీఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజ్​వీర్ మీనా 2015లో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details