చైనాలోని గియిజు ప్రావిన్స్ చిషు గ్రామానికి చెందిన 57 ఏళ్ల జు జియామింగ్ 1990లో ఉపాధి వెతుక్కుంటూ హుబెయి ప్రావిన్స్‌కు వెళ్లాడు. అదే ఏడాది పని చేసే చోట జియామింగ్ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. మెదడుకు దెబ్బ తగలడం వల్ల గతం మర్చిపోయాడు. శారీరకంగా కోలుకున్నా.. అతడి గుర్తింపు కార్డు పోవటం వల్ల నిలువ నీడ లేక.. ఉపాధి లేక నిరాశ్రయుడిగా మిగిలిపోయాడు. అయితే ఓ జంట అతడిని చేరదీసింది. వారి కుటుంబంలో ఒకడిగా చేర్చుకుంది. అయినా అతడు తన స్వగ్రామం, కుటుంబం, మర్చిపోయిన గతం గురించి తీవ్రంగా ఆలోచించేవాడు. ఎంత ప్రయత్నించినా గుర్తుకువచ్చేది కాదు. అయితే 2015లో వారంతా హిజియంగ్ ప్రావిన్స్‌లోని యునెకు మారారు. అది జియామింగ్ స్వగ్రామానికి 1500 కి.మీ దూరంలో ఉంది.
న్యూస్‌లో విని... వీడియో కాల్...
ఇటీవల చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. కరోనా సంబంధించిన వార్తలు ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడెక్కడ కరోనా మరణాలు చోటు చేసుకున్నాయో వార్తలో వివరించారు. జియామింగ్ స్వగ్రామం చిషులోనూ ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వార్తలో కనిపించింది. ఆ వార్త చూసిన జియామింగ్‌కు తన స్వగ్రామం గుర్తుకొచ్చింది. దీంతో గతం, కుటుంబం కూడా గుర్తుకొచ్చాయి. వెంటనే జియామింగ్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. తనను తన కుటుంబంతో కలపమని కోరాడు. పోలీసులు జియామింగ్ గాథ విని స్పందించారు. అతడి కుటుంబ సభ్యుల చిరునామా, వివరాలు సేకరించారు. వీడియోకాల్ ద్వారా జియామింగ్‌ను తన తల్లితో మాట్లాడించారు.