తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చు: 5 రోజుల్లో 5 వేల ఒంటెలను చంపేశారు! - ఆస్ట్రేలియాలో ఒంటెలు

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు దహించివేస్తుంటే మరోవైపు వన్యప్రాణుల మృత్యుఘోష ప్రతిధ్వనిస్తోంది. ఏడాది నుంచి తీవ్ర కరవుతో అల్లాడుతున్న ఆ దేశం ఒంటెలను చంపేందుకు నిర్ణయించుకుంది. ఐదు రోజుల్లో 5 వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కార్చిచ్చు వల్ల ఏర్పడ్డ దట్టమైన పొగ మెల్​బోర్న్ నగరాన్ని కమ్మేసింది. గాలి నాణ్యత అత్యంత అథమ స్థాయికి పతనమైంది. ఆస్ట్రేలియా ఓపెన్​ టోర్నమెంట్​పైనా కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది.

5,000 feral camels culled in drought-hit Australia
ఆస్ట్రేలియా కార్చిచ్చు: 5 రోజుల్లో 5 వేల ఒంటెలను చంపేశారు!

By

Published : Jan 14, 2020, 10:46 PM IST

కనీవినీ ఎరుగని కార్చిచ్చుతో అతలాకుతలమైన ఆస్ట్రేలియాలో వన్యప్రాణుల మృత్యుఘోష కన్నీరు పెట్టిస్తోంది. తీవ్ర కరవుతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాలో ఐదు రోజుల్లో 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్లలో తిరుగుతూ ఒంటెలను చంపినట్లు వెల్లడించారు. అనంగు పిజంజజరా యకుంజజరా ప్రాంత అధికారుల (ఏపీవై) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే కార్చిచ్చు(బుష్‌ఫైర్‌) వల్ల కొన్ని వేల జంతువులు చనిపోయాయి. దీని కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించడమే కాదు పలు ప్రాంతాల్లో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడటం వల్ల ఒంటెలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఏపీవై జనరల్‌ మేనేజర్‌ రిచర్డ్‌ కింగ్‌ స్పందించారు.

ఆదివారం వరకు సుమారు 5వేలకు పైగా ఒంటెలను చంపేసినట్లు కింగ్‌ వెల్లడించారు. ఆస్ట్రేలియా గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను నమోదు చేసుకున్న సంవత్సరంగా నిలిచింది. బుష్‌ఫైర్‌, నీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కార్చిచ్చు వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు.

ఎందుకీ చర్యలు..

ఆస్ట్రేలియాలో దాదాపు 10 లక్షల ఒంటెలున్నాయి. 19వ శతాబ్దంలో దాదాపు 20 వేల ఒంటెలను భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటి సంతతి పెరిగి దాదాపు 10 లక్షలకు చేరుకుంది. 2019 ఆస్ట్రేలియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసింది. దక్షిణ భాగంలో తీవ్ర కరవు ఏర్పడటం వల్ల ఒంటెలు నీటి వనరులన్న ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఇవి నీటిని బాగా తాగి నిల్వచేసుకుంటాయి. ఇప్పటికే క్షామంతో అల్లాడుతున్న దేశంలో ఒంటెల మందలు నీటివనరులపై పడటం వల్ల నీటి లభ్యత మరింత తగ్గిపోనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 వేల ఒంటెల వరకు కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మెల్​బోర్న్​లో కారుమబ్బులు

మరోవైపు ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్​బోర్న్​లో కార్చిచ్చు పొగ వ్యాపించింది. నగరమంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కరోజులోనే నగరంలో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధమ స్థాయికి పడిపోయింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇళ్లలోనుంచి బయటకు రాకూడదని, ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.

విక్టోరియా రాష్ట్రంలో 16 కార్చిచ్చులు ఇంకా మండుతూనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 14 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం దహించుకుపోయింది.

"రాత్రికి రాత్రే మెల్​బోర్న్​లో పరిస్థితి ప్రపంచంలోనే అధమ స్థాయికి చేరింది. వేడి ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చవచ్చు. 65 ఏళ్లుపైబడిన వారు, 15 ఏళ్ల లోపు పిల్లలు, గర్భిణులపై ఈ పరిస్థితులు హాని కలిగించే అవకాశం ఉంది. వీరందరూ పొగకు బహిర్గతం కాకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి."-బ్రెట్ సట్టన్, విక్టోరియా వైద్యాధికారి

నేటి నుంచి వారం రోజుల పాటు వర్ష సూచనలున్నాయని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటించిన వార్త... కార్చిచ్చు ప్రాంత వాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దావనలం వ్యాపించిన ప్రదేశంతో పాటు దేశంలోని తూర్పు తీరంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్​పైనా ప్రభావం

మరోవైపు ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్​పైనా ఈ కాలుష్యం ప్రభావం చూపించింది. భారీగా పొగ వ్యాపించడం వల్ల క్వాలిఫైయింగ్​ మ్యాచ్​లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం ఉదయం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్లనూ రద్దు చేశారు.

కార్చిచ్చులో గ్రామం సమిథ

న్యూసౌత్​వేల్స్​లోని నెర్రిగుండా అనే చిన్న గ్రామాన్ని కార్చిచ్చు దహించివేసింది. మంటల ధాటికి గ్రామంలోని ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. గతంలో ఈ ప్రాంతంలో బంగారం మైనింగ్ జరిగేది. కానీ ప్రస్తుతం ఈ గ్రామంలో పదుల సంఖ్యలోనే నివాసం ఉంటున్నారు. రెండు రోజుల తర్వాతే కార్చిచ్చు గ్రామానికి వ్యాపిస్తుందని అంచనా వేసినా... అంతకుముందే ఈ ప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది

ఇదీ చదవండి: వచ్చే నెలలో భారత్​ రానున్న అమెరికా అధ్యక్షుడు!

ABOUT THE AUTHOR

...view details