తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సిన్​ వేటలో ప్రపంచ దేశాలు- మరి ఫలితముందా?

చైనా వుహాన్​లో కరోనా మహమ్మారి బయటపడి దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది క్లినికల్​ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో కనీసం ఒక 40 ట్రయల్స్​ వ్యాక్సిన్​ కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇంతకీ... ఇప్పటివరకు ఎంతమేర పురోగతి సాధించాయి? వ్యాక్సిన్​ వచ్చేది ఎప్పటికి?

40 COMPANIES WORKING ON CORONA VACCINE WORLDWIDE
వ్యాక్సిన్​ వేటలో ప్రపంచదేశాలు- మరి ఫలితముందా?

By

Published : May 31, 2020, 7:54 PM IST

కరోనా వైరస్​ జనటిక్​ వివరాలు ప్రపంచానికి చైనా చెప్పినప్పటి నుంచి మొదలైంది.. వ్యాక్సిన్​ వేట. ప్రపంచదేశాల్లో పేరెన్నికగన్న పరిశోధనశాలలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే తొలుత అందరూ అసలు కరోనా వైరస్​ పరీక్షల కోసం కిట్లు తయారు చేసే పనిలో పడ్డారు. కానీ అందరి అంతిమ లక్ష్యం ఒకటే... 'కరోనా వ్యాక్సిన్'.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) లెక్కల ప్రకారం దాదాపు 40 వ్యాక్సిన్​ బృందాలు టీకా కోసం పనిచేస్తున్నాయి. అయితే ఏవీ ఇప్పటివరకు మనుషులపై పూర్తిగా ప్రయోగం చేసే స్థాయికి చేరుకోలేదు.

చైనా ముందడుగు...

చైనాకు చెందిన 'కేన్​సైనో బయోలజిక్స్​' లాన్సెట్​ మెడికల్​ జర్నల్​లో తన ట్రయల్స్​ గురించి ప్రచురించింది. హుబేయి రాష్ట్రంలో వందమంది ఆరోగ్యవంతుల మీద ఈ సంస్థ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించింది. ప్రస్తుతం ఫేజ్​-2లో అడుగుపెట్టింది.

ఈ సంస్థ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఇది వైరస్​ను ఎదుర్కొనేందుకు సరిపోతుందా అన్నదే ప్రశ్న.

28 రోజులపాటు వీరు చేసిన ప్రయోగంలో టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) పెరిగాయి. అంతేకాదు వైరస్​ల నుంచి కాపాడే టీ కణాల్లోనూ స్పందన కనిపించింది. కానీ కొద్దిపాటి నొప్పులు, అలసట, తలనొప్పి వంటి సైడ్​ ఎఫెక్ట్​లు వచ్చాయి.

ప్రస్తుతం చైనాలో ఈ వ్యాక్సిన్​పై పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. కెనాడాలో 100 మందిపై ఈ వ్యాక్సిన్​ ప్రయోగిస్తున్నారు.

ఆక్స్​ఫర్డ్​ (యూకే)...

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధిలో యూకేకు చెందిన ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం చెప్పుకోదగ్గ ఫలితాలే సాధిస్తోంది.

గత నెలలో 1000 మంది వలంటీర్లపై ఆక్స్​ఫర్డ్​ శాస్త్రవేత్తలు ట్రయల్స్​ నిర్వహించారు. బ్రిటన్​వ్యాప్తంగా 10 వేల మందిపై వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిర్వహిస్తామని గతవారం శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందులో వృద్ధులు, చిన్నపిల్లల్నీ కూడా భాగం చేయనున్నారు.

ఇప్పటికే 400 మిలియన్ల వ్యాక్సిన్​ డోసుల ఉత్పత్తి కోసం డ్రగ్​ తయారీ సంస్థ ఆస్ట్రాజెన్​కా... ఆక్స్​ఫర్డ్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్​ కోసం యూఎస్​ బయోమెడికల్​ అడ్వాన్స్​డ్​ రీసెర్చ్​, డెవలప్​మెంట్​ అథారిటీ దాదాపు ఒక బిలియన్ యూఎస్​​ డాలర్లు సాయం చేస్తోంది.

ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్​ను కనిపెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఫేజ్​-3 ట్రయల్​పై శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు.

కేన్​సైనో (చైనా), ఆక్స్​ఫర్డ్​ (యూకే) రెండూ వ్యాక్సిన్ ప్రక్రియలో ముందడుగు సాధించాయి. సార్క్​-కొవ్​-2ను ఎదుర్కొని నిలబడే రోగనిరోధక శక్తిపై కృషి చేస్తున్నాయి. మోడెర్నా వంటి ఇతర ఫార్మా సంస్థలు ఇతర పద్ధతుల్లో వ్యాక్సిన్​ కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.

అయితే ఇవ్వనీ చిన్న సూక్ష్మస్థాయి వైరస్​ కణాలకు మన దేహం ఎలా ప్రతిస్పందిస్తుందో చూసి.. వ్యాక్సిన్​ను తయారు చేస్తాయి.

ఇవి కాస్త భిన్నం...

కానీ ఎమ్​ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​లో మాత్రం ఎలాంటి డిసీజ్ కాజింగ్​ ఆర్గనిజమ్​ ఉండదు. వైరస్​ను ఎదుర్కొనేందుకు మన శరీరాన్నే దీటుగా తయారు చేస్తుంది. వైరస్​ను గుర్తించి మన శరీరమే దానితో పోరాడేలా సిద్ధం చేస్తుంది.

ఐరోపా సమాఖ్య ఈ ఎమ్​ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​ కోసం పెద్ద ఎత్తునే ఖర్చు పెడుతోంది. అయితే ఇలాంటి కొత్తరకం విధానాలతో ఫలితం రాబట్టాలంటే చాలా సవాళ్లు ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు ఈ వ్యాక్సిన్​ ఫలితమిస్తుందా లేదా? అనేదే పెద్ద ప్రశ్న.

వీటికి వినియోగిస్తోన్న ప్రోటీన్లు వైరస్​ను ఎదుర్కొనేందుకు సరిపోతాయా అనేది ఇంకో ప్రశ్న. అయితే ఒకవేళ ఈ పద్ధతిలో వ్యాక్సిన్​ తయారైనా అది తాత్కాలికమే అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

లండన్​ ఇంపీరియల్​ కాలేజ్​తో కలిసి ఐరోపా సంస్థలు ఈ విధానంలో వ్యాక్సిన్​​ కోసం కృషి చేస్తున్నాయి.

డీఎన్​ఏ వ్యాక్సిన్...

ఇనోవియో సంస్థ డీఎన్​ఏ వ్యాక్సిన్​ కోసం పనిచేస్తోంది. సార్స్​-కొవ్​-2 ప్లాస్​మిడ్​ డీఎన్​ఏను ఉపయోగించి ఈ సంస్థ టీకా కనిపెట్టేందుకు ప్రయోగాలు చేస్తోంది.

అయితే ఇప్పటివరకు ఎలాంటి విజయవంతమైన ఎమ్​ఆర్​ఎన్ఏ, డీఎన్​ఏ వ్యాక్సిన్​లు వాడుకలో లేవు.

చికిత్స వైపు చూపులు...

వ్యాక్సిన్ కష్టమని భావిస్తోన్న కొంతమంది కరోనా చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఎమోరీ విశ్వవిద్యాలయం, మరికొంత మంది శాస్త్రవేత్తలు కనిపెట్టిన 'రెమ్​దెసివిర్'​ డ్రగ్​ను కరోనా చికిత్స కోసం వినియోగిస్తున్నారు.

ఇది కరోనా రాకుండా కాపాడలేదు కానీ.. వైరస్​ లక్షణాలను తగ్గిస్తుందని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. కరోనా రోగి ఆసుపత్రిలో ఉండే కాలాన్ని 31 శాతం ఈ డ్రగ్​ తగ్గిస్తుందని మరో అధ్యయనం తేల్చింది. అయితే మరణాల రేటు తగ్గిస్తుందా అనేది తెలియదు.

రెమ్​దెసివిర్​ను ఉత్పత్తి చేస్తోన్న గిలీడ్​ సంస్థ.. డ్రగ్​ తయారీని డిసెంబర్​ 1 నాటికి 10 లక్షలకు పెంచుతామని తెలిపింది. అయితే ఈ డ్రగ్​కు ప్రపంచంలో ఇప్పటివరకు ఎలాంటి ఆమోదం లభించలేదు.

మరిన్ని...

ఇతర చికిత్స విధానాలను శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. అందులో ప్లాస్మా చికిత్స ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టీబీకి వినియోగించిన పాత వ్యాక్సిన్​ బీసీజీని శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు.

ఆస్ట్రేలియా, నెదర్​ల్యాండ్స్​లో ఇంకా వ్యాక్సిన్​ కోసం అధ్యయనాలు జరుగుతున్నాయి.

అయితే వ్యాక్సిన్​, చికిత్స విధానాల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అయితే ఇవి ఎంతవరకు విజయవంతమవుతాయనేది వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details