పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా ఇప్పటివరకు 3 లక్షల 75 వేల యాంటి టెర్రర్ ఆపరేషన్లు చేసినట్లు పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఈ కార్యకలాపాలు అన్నీ కేవలం నాలుగేళ్లలో చేసినట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘావేసి.. వాటిని అంతమోందించినట్లు పేర్కొంది. 'రాద్-ఉల్-ఫసద్' అనే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీఖర్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఇప్పటి వరకు పోరాటం చేసిందన్నారు. తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అంతం చేసే దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశానికి ముందుగా పాకిస్థాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2018 జూన్‌లో పారిస్‌లో నిర్వహించిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్థాన్‌ను 'గ్రే' లిస్ట్‌లో చేర్చింది. త్వరలో జరగబోయే ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో క్రోడీకరించిన 27 అంశాలపై పాక్ అనుసరించే విధానంపై సమీక్ష జరుగుతుంది. అనంతరం పాక్‌ని గ్రే లిస్ట్‌లో ఉంచాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది.