అప్గానిస్థాన్‌లోని హెరాత్ ప్రాంతంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో కనీసం 200 మంది తాలిబన్లు మరణించారు. దీనితో హెరాత్ ప్రావిన్స్‌ను ఆక్రమించకుండా తాలిబన్లను నిలువరించగలిగారు. ఈ మేరకు స్థానిక మీడియా 'అఫ్గానిస్థాన్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడులపై అటు అమెరికా గానీ.. తాలిబన్లు గానీ స్పందించలేదు.
హెరాత్ పరిధిలో ఉన్న గోజరా జిల్లాను తాలిబాన్లు గురవారం హస్తగతం చేసుకున్నారు. ఈ నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం గమనార్హం.
'అమెరికా వైమానిక దళానికి చెందిన జెయింట్ బీ-52 విమానం తాలిబన్ల స్థావరాలపై బాంబు దాడి జరిపింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు మరణించారు' అని హెరాత్ చట్టసభ ప్రతినిధి జిలానీ ఫర్హాద్ తెలిపారు. దీనితో పాటు వివిధ ప్రాంతాల్లో అమెరికా జరిపిన దాడుల్లో ఐదుగురు తాలిబన్లు హతమయ్యారని వివరించారు.