కుక్కలు మనుషుల్ని కరవడం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాము. శునకాల దాడిలో మనుషులకు తీవ్ర గాయాలు కూడా అవుతూ ఉంటాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. జనావాస ప్రాంతాల నుంచి శునకాలను అధికారులు తరలించడం చూస్తూనే ఉంటాము. అయితే పాకిస్థాన్‌లోని రెండు శునకాలు.. ఓ వ్యక్తిని కరిచిన కారణంగా.. 'మరణ శిక్ష'ను ఎదుర్కొంటున్నాయి.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ కరాచీలోని సీనియర్ న్యాయవాది మీర్జా అఖ్తర్.. మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చారు. అదే సమయంలో జర్మన్ షెపార్డ్ జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలు.. ఆయనపై దాడి చేశాయి. ఆయన ఏం చేయకుండానే కరిచేశాయి. దీంతో మీర్జా అఖ్తర్‌కు తీవ్ర గాయాలయ్యారు. కుక్కలు న్యాయవాదిని నేల మీద పడేసి దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉండే సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
అయితే ఈ రెండు శునకాలు ఆ పొరుగున ఉన్న హుమాయున్ ఖాన్‌కు చెందినవి. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. శునకాల యజమానిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సరైన శిక్షణ లేకుండా నివాసిత ప్రాంతాల్లో ఇలాంటి శునకాలను ఎలా ఉంచుకుంటున్నారని పలువురు ప్రశ్నించారు.