రష్యాలోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. తొలుత ఏడుగురు చనిపోగా.. తొమ్మిది మంది అచూకీ గల్లంతైనట్లు తెలిపిన అధికారులు.. కాసేపటికే అదృశ్యమైనవారు కూడా చనిపోయినట్లు వెల్లడించారు.
మాస్కోకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 170 మంది సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టగా.. 50 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.