నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా చైనా అతలాకుతలమవుతోంది. ఇప్పటి వరకు చనిపోయిన, గల్లంతైన వారి సంఖ్య 141కు చేరిందని ఆ దేశ మీడియా తెలిపింది. దేశవ్యాప్తంగా 28వేల ఇళ్ల వరకు నేలమట్టమైనట్లు, 3.7 కోట్ల మంది ప్రభావితమైనట్లు వెల్లడించింది.
వరదల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ సహా 433 నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో 33 నదులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో చైనా జాతీయ విపత్తు నిర్వహణ విభాగం మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఇప్పటివరకు 2.24 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.