చిచ్చరపిడుగు స్పీడు.. 11నెలలకే స్నోబోర్డింగ్! 11నెలల వయస్సులో చిన్నారులు.. ఎక్కువగా నిద్రతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిద్రలేస్తే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ చైనాకు చెందిన వాంగ్ యుజి మాత్రం.. ఏకంగా స్నోబోర్డ్ ఎక్కేసి మంచులో రయ్.. రయ్ అంటూ దూసుకెళ్లిపోతోంది. కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు, వంటి మీద స్వెటర్.. తలమీద హెల్మెట్.. దానిపైన కూలింగ్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా స్నోబోర్డింగ్ చేసేస్తోంది వాంగ్ యుజి.
సాధారణంగా.. ఈ సమయానికి చైనాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తూ ఉంటుంది. చోంగ్లీ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో స్నోట్రాక్స్ ఉంటాయి. స్నోబోర్డింగ్ ప్రియులకు ఆ ప్రాంతమంటే చాలా ఇష్టం. అక్కడే వాంగ్ యుజి స్నోబోర్డ్తో ప్రాక్టీస్ చేసింది.
11నెలల వయస్సులో స్నోబోర్డింగ్ అంటే కష్టమైన విషయమే. కానీ యుజికి మంచి ఫిట్నెస్ ఉండటం వల్ల ఇది సాధ్యమైందని అంటోంది యుజి తల్లి.
"తల్లిదండ్రులకు వచ్చిన క్రీడలనే పిల్లలు కూడా నేర్చుకోవాలని మా కుటుంబ సిద్ధాంతం. మాకు తెలియని క్రీడలను మా పిల్లలకు నేర్పించము. నేను నా భర్తతో స్నోబోర్డింగ్ నేర్చుకున్నా. అందుకే యుజికి కూడా అదే నేర్పిస్తున్నాము. కొంత వయస్సు వచ్చాక యుజికి స్నోబోర్డింగ్ నేర్పిద్దామని ముందు అనుకున్నాము. కానీ యుజికి ఇది చాలా నచ్చేసింది. ఇంట్లో ఓసారి ప్రయత్నించినప్పుడు.. తను అసలు బయటపడలేదు. చాలా ఎంజాయ్ చేసింది. ఇక యుజిని మేము రంగంలోకి దింపేశాము. బీజింగ్‌ను చోంగ్లీకి తనని తీసుకొచ్చాము."
-- ఫ్యాన్ జుయేయిన్, యుజి తల్లి.
యుజి స్నోబోర్డింగ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యుజి ముద్దుముద్దు చేష్టలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి:-చైనాలో హిమపాతం.. మంచు ముసుగులో పర్యటక ప్రాంతాలు!