ఉగ్రవాదానికి కొమ్ముకాస్తూ తామూ బాధిత దేశంగా చెప్పుకుంటున్న పాకిస్థాన్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మొట్టికాయలు వేసిన క్రమంలో తీవ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టింది. తాజాగా.. వాయువ్య, నైరుతి పాకిస్థాన్లో జరిపిన దాడుల్లో 16 మంది ఉగ్రవాదులను ఆ దేశ భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ ఘటనల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు.
బలూచిస్థాన్ రాష్ట్రంలోని మస్తుంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా.. 9 మంది ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనాస్థలిలో తుపాకులు, పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.
మరోవైపు, రాష్ట్రంలోని హర్నాయి జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) కమాండర్ సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరో ఉగ్రవాది హతం
ఉత్తర వాజిరిస్థాన్లోని మిరాన్ షా ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా... భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం కాగా.. ఇద్దరు సైనికులు మరణించారు. ఈ మేరకు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.
మెడపై ఎఫ్ఏటీఎఫ్ కత్తి