తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా 'పులి'కి కరోనా- భారత్​లోని 'జూ'లలో హైఅలర్ట్​

దేశవ్యాప్తంగా అన్ని 'జూ'ల్లోనూ హై అలెర్ట్​ ప్రకటించారు అధికారులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జంతువుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అనుమానాలున్న వాటి శాంపిల్స్​ను సేకరించి కొవిడ్​-19 నిర్ధరణ పరీక్షలకు పంపాలని ఆదేశించారు. అమెరికాలో 'జూ'లో ఉన్న ఓ పులికి కరోనా పాజిటివ్​ వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Zoos across India put on high alert after tiger tests positive for COVID-19 in US
'పులి'కి కరోనా-దేశవ్యాప్తంగా అన్ని 'జూ'లల్లో హైఅలర్ట్​

By

Published : Apr 6, 2020, 3:44 PM IST

ఇంతవరకూ మనుషులకు పరిమితమైన కరోనా వైరస్​ మొట్టమొదటి సారిగా ఓ పులికి సోకినందున... కేంద్ర జంతు ప్రదర్శనశాల ప్రాధికార సంస్థ(సీజెడ్​ఏ) అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని 'జూ'ల్లోనూ హైఅలర్ట్​ ప్రకటించారు అధికారులు. అనుమానాలున్న జంతువుల శాంపిల్స్​ను రెండు వారాలకొకసారి సేకరించాలని సూచించారు. ఈ మేరకు సీజెడ్​ఏ కార్యదర్శి ఎస్​పీ యాదవ్​ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఓ లేఖ రాశారు.

అమెరికా న్యూయార్క్​లోని బ్రాంక్స్​ 'జూ'లో నదియా అనే ఓ ఆడ పులికి కొవిడ్​-19 సోకింది. ఈ నేఫథ్యంలో దేశంలోని అన్ని 'జూ'లు అప్రమత్తతతో వ్యవహరించాలని, 24 గంటలూ సీసీటీవీ ద్వారా జంతువుల ప్రవర్తనను పర్యవేక్షించాలని ఆదేశించారు యాదవ్.

" క్షీరదాల్లో ముఖ్యంగా పిల్లులు, ముంగీసలు, కోతులపై అత్యంత శ్రద్ధ వహించాలి. అనుమానమున్న జంతువుల శాంపిల్స్​ను రెండువారాలకొకసారి సేకరించి.. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం గుర్తింపున్న జంతు ఆరోగ్య కళాశాలలకు పంపాలి. భోపాల్​లోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హైసెక్యూరిటీ ఆనిమల్​ డిసీస్​, హరియాణాలోని నేషనల్​ రీసెర్చ్​ సెంటర్​ ఆన్​ ఎక్వైన్స్​, ఉత్తర్​ప్రదేశ్​లోని ఇండియన్​ వెటెరినరీ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​కు అనుమానిత జంతు శాంపిల్స్​ను పంపొచ్చు. ఆరోగ్యం క్షీణించిన జంతువులను కచ్చితంగా ఐసోలేషన్​లో ఉంచి క్వారంటైన్​ చేయాలి."

- అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సీజెడ్​ఏ లేఖ

జంతు సంరక్షకులు కేంద్రం లేదా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) సూచనల మేరకు నడుచుకోవాలని, సరైన వ్యక్తిగత రక్షణ కవచం(పీపీఈ) లేకుండా జంతువులకు ఆహారం పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు యాదవ్​.

ఇదీ చూడండి : కొన్ని దేశాల్లో తగ్గిన కరోనా ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details