అంతర్జాల దిగ్గజం యూట్యూబ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో అసత్య వార్తలను నిరోధించడంలో భాగంగా.. ఓటర్లను తప్పుదారి పట్టించే వీడియోలను తమ వెబ్సైట్నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దినెలల ముందు ఈ మేరకు చర్యలు చేపట్టింది ఆ సంస్థ.
ఆరోగ్యకరమైన రాజకీయాలను ప్రోత్సహించి, నమ్మదగిన సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది యూట్యూబ్. ఓటింగ్, జనాభా గణన విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారంపైనా నిషేధం విధించనున్నట్లు గూగుల్ ఆన్లైన్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం సారథి క్రిస్టీ కానెగల్లో తెలిపారు.