కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదరణ బాగా పెరిగింది. కొన్ని సంస్థలు ప్రత్యేకించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లనే నియమించుకుంటున్నాయి. ఈ విధానం... ఉద్యోగార్థులకు, సంస్థలకు లాభదాయకంగా మారింది.
కానీ.. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం తీసుకొచ్చిన ఓ కొత్త చట్టం.. కొండ నాలుక్కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారైంది. ఆ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండలేక.. 'ఆ రాష్ట్ర వాసులకు పూర్తిగా ఉద్యోగాలే ఇవ్వం' అంటూ ప్రకటనలు చేస్తున్నాయి కొన్ని దిగ్గజ సంస్థలు. 'కొలరాడో రాష్ట్ర వాసులు తప్ప ఎవరైనా అర్హులే' అంటూ నోటిఫికేషన్లలో పేర్కొంటున్నాయి.
అలా ఎందుకు..?
"ఇటీవల కొలరాడో రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు కూడా.. ఉద్యోగులకు ఎంత జీతం చెల్లిస్తారనే విషయాన్ని ప్రకటనల్లో స్పష్టంగా తెలపాలి. ఒకే ప్రాంతంలో ఉండి పని చేస్తున్నవారి విషయంలోనూ ఇది వర్తిస్తుంది" అని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వేతనాల చెల్లింపుల విషయంలో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి.. పారదర్శకతను తీసుకొచ్చే లక్ష్యంతో ఈ చట్టం రూపొందించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
"వేతన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు.. కొన్ని సంస్థల యజమానులు కొలరాడోలో నివసించేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయనవసరం లేదని చెబుతున్నారు" అని వివరించింది.
ప్రకటన ఇలా..
ఉదాహరణకు జాన్సన్ అండ్ జాన్సన్ కొత్త ఉద్యోగ ప్రకటన చూస్తే.. "సంస్థ ఆమోదించిన పని ప్రదేశాల్లో తప్ప.. కొలరాడో నుంచి పని చేయడానికి వీల్లేదు" అని పేర్కొంది. అలాగే పలు ఉద్యోగాలతో ప్రకటన ఇచ్చిన కార్డినల్ హెల్త్ సంస్థ.. "ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు. వీటిని కొలరాడో రాష్ట్రం వెలుపల ఉన్నవారితో భర్తీ చేస్తాం" అని స్పష్టంచేసింది.