అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని పేర్కొంది అగ్రరాజ్యం. భారత్కు జీఎస్పీ హోదా తొలగించడానికి గల కారణాలు ఇంకా అలాగే ఉన్నాయని.. వాటితో తమకు ఇబ్బందులున్నాయని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ పర్యటనకు రెండు రోజులే సమయం ఉన్నప్పటికీ.. ఇంకా ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని స్పష్టం చేశారు.
వివిధ రంగాల్లోని మార్కెట్లను అమెరికా వినియోగించుకునేందుకు సమానమైన అవకాశం ఇవ్వడంలో భారత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మార్కెట్ల అవకాశాలకు ఉన్న అడ్డుగోడలను తొలగించేందుకు భారత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
"భారతదేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అమెరికాకు చాలా ముఖ్యం. అదే సమయంలో అమెరికా మార్కెట్లను పొందడమూ భారత్కు ముఖ్యమే. ఈ విషయాల్లో ఇరు దేశాల మధ్య సమతుల్యతను తీసుకురావాలనుకుంటున్నాం. ఆందోళనలను పరిష్కరించాలనుకుంటున్నాం. అయితే.. వాణిజ్య ప్యాకేజీపై ప్రకటన ఉంటుందా లేదా అనేది పూర్తిగా భారత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఒప్పందం కుదిరే అవకాశం లేదు."